ఏపీ లిక్కర్ స్కామ్‌.. విజయసాయి వాంగ్మూలం రికార్డ్ చేసిన ఈడీ

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయిని గురువారం (జనవరి 22) విచారించి, ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. జగన్ హయాంలో మద్యం విధాన రూపకల్పన, అమలు ప్రక్రియలో జరిగిన అవకతవకలు, అవినీతి, అక్రమాలపై ఈడీ విజయసాయిపై ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే భారీగా అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలపైనా ఈడీ విజయసాయిని సుదీర్ఘంగా విచారించింది.  అదే విధంగా మద్యం కుంభకోణం ద్వారా  అక్రమంగా వచ్చిన నగదును విదేశాలకు తరలించిన అంశం, హవాలా మార్గాల వినియోగం, షెల్ కంపెనీల ఏర్పాటు ద్వారా మనీ లాండరింగ్ జరిగిందా అనే కోణంలో ఈడీ  దర్యాప్తు చేస్తోంది. డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ  ఏపీలో మద్యం విక్రయాలు క్యాష్ అండ్ క్యారీ రూపంలోనే నగదు రూపంలోనే ఎందుకు జరపాల్సి వచ్చిందన్న అంశంపై  ఈడీ అధికారులు విజయసాయిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మద్యం పాలసీ రూపకల్పనపై తన సమక్షంలోనే మూడు సార్లు సిట్టింగులు జరిగినట్లు విజయ్ సాయి రెడ్డి ఈడీకి వాంగ్మూలం ఇచ్చినట్లూ, అయితే  ఆ పాలసీ రూపకల్పనతో తనకు ప్రత్యక్ష సంబంధం లేదని చేసినట్లు తెలిసింది.   ఇక ఇదే కేసుకు సంబంధించి ఈడీ శుక్రవారం వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డిని విచారించనుంది.  ఈ కేసులో ఇప్పటికే ఇప్పటికే పలువురు కీలక వ్యక్తుల పాత్రపై  ఫోకస్ పెట్టిన ఈడీ.. రానున్న రోజులలో మరింత మందిని విచారించే అవకాశం ఉందని అంటున్నారు.  ఈ కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకోవడంతో విజయసాయి, మిథున్ రెడ్డిల విచారణ అనంతరం ఈడీ టార్గెట్ ఎవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
Publish Date: Jan 22, 2026 12:28PM

జగన్ మళ్లీ పాదయాత్ర.. అధికారమే టార్గెట్.. వర్కౌట్ అవుతుందా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్రకు సమాయత్తమౌతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు మరో మూడేళ్ల వ్యవధి ఉండగానే జగన్ పాదయాత్ర ప్రకటన రాజకీయంగా చర్చకు తెరతీసింది. 2019 ఎన్నికలకు ముందు జగన్ ప్రజా సంకల్పయాత్ర పేరిట దాదాపు 16 నెలల పాటు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ పాదయాత్ర కారణంగానే అప్పటి ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.  అయితే అధికారంలో ఉన్న ఐదేళ్లూ జగన్ సర్కార్ విధానాలు, జగన్ కక్ష సాధింపు రాజకీయాలు, అలాగే రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, అరకొర సంక్షేమంతో  సాగించిన పాలనా, అలాగే జగన్ అనుసరించిన ఆర్థిక అరాచకత్వ విధానాల కారణంగా 2024 ఎన్నికలలో పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా 11 స్థానాలకే పరిమితమైంది.  గత ఎన్నికలలో పరాజయం తరువాత జగన్  రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వస్తున్నారు. ఎక్కువగా బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్ కే పరిమితమౌతూ రాష్ట్రంలో పార్ట్ టైమ్ రాజకీయాలు నెరపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ బలహీనపడింది.  ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పార్టీని మళ్లీ బలోపేతం చేయాలంటే పాదయాత్ర శరణ్యమని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.  తాజాగా తాడేపల్లిలోని పార్టీ క్యాంపు ఆఫీసులో ఏలూరు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జగన్ తన పాదయాత్ర ప్రకటన చేశారు.  తన ప్రకటన పార్టీ క్యాడర్ లో జోష్ నింపుతుందని ఆయన భావిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.   అయితే జగన్ పాదయాత్ర @ 2.0 వల్ల పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు ఆయన సుదీర్ఘ పాదయాత్రకు విశేష స్పందన లభించింది. అప్పట్లో ఆయన అడుగుకో హామీ అన్నట్లుగా వాగ్దానాలు గుప్పించారు. వాటిని నమ్మి జనం ఆయన పార్టీకి బ్రహ్మరథం పట్టి ఆ ఎన్నికలలో ఘన విజయం చేకూర్చి పెట్టారు. అయితే అయిదేళ్ల పాలనలో  పాదయాత్ర ద్వారా వచ్చిన మైలేజీని పూర్తిగా పోగొట్టుకోవడమే కాకుండా,   తీవ్ర ప్రజా వ్యతిరేకతను కూడా జగన్ మూటగట్టుకున్నారు. హామీల అమలు విషయాన్ని పట్టించుకోలేదు. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను అరకొరగా అమలు చేశారు. అంతే కాకుండా  అధికారంలో ఉన్నప్పుడు జనం మొహం చూడటానికి కూడా ఇష్టపడకుండా, బయటకు వచ్చినప్పుడు రోడ్డుకు ఇరువైపులా పరదాలు కట్టుకు తిరిగిన జగన్.. పార్టీ పరాజయం తరువాత కూడా పెద్దగా జనంలోకి రాలేదు. మరి ఇప్పుడు పాదయాత్ర అంటూ మరో సారి జనం ముందుకు వచ్చే ప్రయత్నం ఏ మేరకు వర్కౌట్ అవుతుందన్నది అనుమానమేనన్నది పరిశీలకుల విశ్లేషణ.  
Publish Date: Jan 22, 2026 9:43AM

అమరావతికి కేంద్రం చట్టబద్దత!

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని చట్టబద్ధంగా ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. అమరావతిని రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అధికారికంగా వినతిపత్రం సమర్పించింది. 2024 జూన్‌ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో,  ఏపీకి రాజధానిని తప్పక ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో, రాజధానిగా అమరావతి ఎంపిక ప్రక్రియ, నిర్మాణ కార్యక్రమాలపై వివరాలను కూడా కేంద్రానికి నోట్‌ ద్వారా రాష్ట్ర ప్రభఉత్వం అందజేసింది. ఈ విషయమై, కేంద్రం ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖల నుంచి అభిప్రాయాలు సేకరించడమే కాకుండా, నీతి ఆయోగ్‌ అభిప్రాయాన్ని కూడా కోరినట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యాక పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి అమరావతిని రాజధానిగా చట్టబద్ధంగా ప్రకటించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం సూచించిన ప్రకారం.. 2024 జూన్‌ 2 నుంచి అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించేందుకు దాదాపు కేంద్రం నిర్ణయానికివచ్చేసినట్లు సమాచారం.
Publish Date: Jan 21, 2026 4:57PM

మీ ఫోనూ ట్యాప్ అయ్యింది.. విచారణకు వచ్చిన హరీష్ కు షాకిచ్చిన సిట్

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్గెస్ట్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.  బీఆర్ఎస్ కీలక నేత, పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావ్ ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందన్న వాస్తవం వెలుగు చూసింది. ఈ విషయాన్ని   ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులే స్వయంగా తమ ఎదుట విచారణకు హాజరైన  హరీష్ రావుకు వెల్లడించారు. ది ఇప్పుడు  రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా హరీష్ రావు కి విచారణ నిమిత్తం హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నిన్న హరీష్ రావు మంగళవారం (జనవరి 20) అధికారుల ఎదుట హాజరయ్యారు.  హరీష్ రావును విచారించిన అధికారులు, 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొన్ని నెలల పాటు ఆయన ఫోన్ నిఘాలో ఉన్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులు చెప్పగానే హరీష్ రావ్   షాక్‌కు గురైనట్లు సమాచారం. విచారణ సందర్భంగా పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నను హరీష్ రావ్ స్వయంగా కాగితంపై రాసుకున్నారు. తన ఫోన్ ట్యాప్ అయ్యిందన్న విషయాన్ని తొలిసారి విన్న హరీష్ రావ్, వెంటనే , ఇది మీరు సృష్టించారా?  అని సిట్  అధికారులను ప్రశ్నించారు. అనంతరం స్పందించిన అధికారులు, ఫోన్ ట్యాపింగ్ జరిగిన తేదీలు, కాల వ్యవధి వివరాలను హరీష్ రావుకు తెలియజేశారు. అంతేకాదు, హరీష్ రావ్ అనుచరుల ఫోన్లు కూడా అదే సమయంలో కొన్ని ట్యాప్ అయ్యినట్టు సిట్ అధికారులు వెల్లడించడంతో విచారణ మరింత కీలకంగా మారింది. దీనిపై హరీష్ రావ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటివరకు పలువురు కీలక అధికారుల పేర్లు బయటకు రావడంతో పాటు, రాజకీయ నాయ కుల ఫోన్ల ట్యాపింగ్ అంశం ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావం చూపే అంశంగా మారింది. తాజాగా హరీష్ రావ్ ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందన్న విషయం వెలుగులోకి రావడం కేసును మరో దశకు తీసుకెళ్లింది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న ఆదేశాలెవరివి? ఎవరిని లక్ష్యంగా చేసుకుని నిఘా పెట్టారు?రాజకీయ లబ్ధి కోసమే ఈ ట్యాపింగ్ జరిగిందా? అన్న అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. SIT దర్యాప్తు ముమ్మరం కావడంతో రానున్న రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 
Publish Date: Jan 21, 2026 1:19PM

అంతా ఖాళీనే.. ఇదే నిజం.. మోడీ ఇజం

ప్రభుత్వానికి  పేర్లు మార్చడంలోని సరదా, దేశమంతా తన వశంలోకి తెచ్చుకోవాలన్న కోరికా తప్ప చదువు, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన సంగతి ఇసుమంతైనా పట్టడం లేదని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధి కల్పనను  పట్టించుకోకుండా బండి రంగు మారుస్తానంటే ఎట్టా సామీ అంటున్నారు ఏకోపాధ్యాయ పాఠశాల ఉపాధ్యాయులు.  కానీ వారి మాటలు వినే నాధుడేడీ.  ఇప్పటికీ చాలా కాలం నుంచే అధికారులు, ఉపాధ్యాయులు, విద్యావంతులూ విద్యారంగంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని ఏకరవు పెడుతూ వచ్చారు. వివేకానందుడిలా చేతులు కట్టుకుని విన్నట్టు నటించిన దేవరది చెవుడు కాదు, నటన కాదు.. కొండంత నిర్లక్ష్యం అంటూ ప్రతిపక్షాలు గుండె బాదుకుంటున్నాయి. అదీ నిజమే!  ఏమన్నా అంటే ఎగస్పార్టీ వోరికి కుళ్లు అంటూ దబాయించేయడం సర్వసాధారణమైంది. చదువుకుంటేనేగా గ్రామాల్లో వికాసం అంటూ ఉండేది. చదువు చెప్పేవారే  ఉంటే పిల్లలు గేదెలెనకా, మేకలేకనా పరిగెత్తాల్సిన ఖర్మేంటి?  కాస్తంత గ్రామాభివృద్ధి, విద్యారంగంలో రావాల్సిన మార్పుల గురించి ఏకరవుపెడుతున్నవారంతా   గొంతుపోవడం,  అనారోగ్యం పాలవడం తప్ప ఒరుగుతున్నది దాదాపు శూన్యమన్న అభిప్రాయాలే ఎక్కువ వినపడుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి స్వామీ అని అహ్మదాబాద్‌ నుంచి అమలాపురం వరకూ టీచర్లు, ప్రొఫెసర్లు గోడు పెడుతున్నారు. అదే  కాదు అన్ని రంగాల్లోనూ ఉద్యోగాల భర్తీ  వూసే లేదని గోసపడుతున్నారు. అవన్నీపట్టించుకుని పత్రికల ద్వారా, మైకుల్లోనూ అరిచి గింజుకోవడమే అవుతోంది ఈ విషయమై బాధపడుతున్న మేధోవర్గానికి.  అసలు విషయమేమంటే..జూన్‌ 2025 నాటికి కేంద్రీయ విద్యా సంఘఠన్‌లో  7,765 బోధనా సిబ్బంది పోస్టులు, నవోదయ విద్యాసమితిలో 4,323 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర సాయుధ పోలీసు దళాల(సిఎస్‌ఎఫ్‌)లో 25,487 కానిస్టబుల్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే రాజస్థాన్‌లో ఎల్డీసీ క్లర్క్‌ కేడర్2 లో దాదాపు11 వేల ఉద్యోగాలు భర్తీ చేయవలసి ఉంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఏయిమ్స్‌లో ఇంకా 1,731 పోస్టులు  భర్తీ చేయాలి. ఇక బ్యాంకుల విషయానికి వస్తే 12 ప్రభుత్వరంగ బ్యాంకులో 4,20,599 మంది ఆఫీసర్లు, 2,49,817 క్లర్కు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసలే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పథకం పేరు మార్చి దాన్ని రాముడికి అర్పించేసి ఉపాధికి గండి కొట్టేస్తున్నారు. అంతే కాకుండా ఇది  చాలా అద్భుతం అంటూ తమ వారి చేత  భజనచేయించుకుంటున్న పాలకులు  కోట్లాది ప్రజలకు ఉపా ధిని కొంపముంచేస్తున్నారన్న విషయం పెద్దగా, గట్టిగా వినబడకుండా నిరసనల గొంతు నొక్కేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే.. తనకు ఇష్టమైన పదార్థాన్నే దేశ ప్రజలంతా లొట్టలే సుకుంటూ  అందరూ తినాలన్నదే పాలకుల ఇజంగా కనిపిస్తోంది. దానికి మోడీ ఇజం అనోచ్చం టారా?
Publish Date: Jan 21, 2026 11:59AM

ఫొన్ ట్యాపింగ్ కేసు.. హరీష్ రావుకు మళ్లీ నోటీసులు?

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు  ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం (జనవరి 20) దాదాపు ఏడున్నర గంటల పాటు విచారించిన సిట్.. ఆయనకు మరో మారు నోటీసులు జారీ చేయనుంది. మంగళవారం (జనవరి 20) విచారణ సందర్భంగా హరీష్ రావు తన కుమారుడు విదేశాలకు వెళ్తున్నందున సెండాఫ్ ఇవ్వడానికి ఎయిర్ పోర్టుకు వెళ్లాలని   రిక్వెస్ట్ చేయడంతో  ఏడున్నర గంటల తరవాత విచారణ ముగించామనీ, ఆయనను ఇంకా విచారించాల్సిన అవసరం ఉందనీ సిట్ వర్గాలు చెబుతున్నాయి. సిట్ చీఫ్ సజ్జనార్ హరీష్ రావు విచారణ ముగిసిన తరువాత చేసిన ప్రకటన కూడా అదే సూచిస్తోంది.  ఇలా ఉండగా మంగళవారం (జనవరి 20) విచారణ ముగిసిన తరువాత బయటకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు సిట్ సూచనలను పట్టించుకోకుండా  మీడియా ముందు పొలిటికల్ కామెంట్స్ చేశారు. అది పక్కన పెడితే.. విచారణలో భాగంగా హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్ ఫోన్లు ట్యాప్ అయినట్లుగా ఆధారాలను సిట్ బృందం హరీష్ ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది.  అయితే అవన్నీ ఫేక్ అని హరీష్ రావు వాదించినట్లు తెలుస్తోంది.   కాగా మంగళవారం (జనవరి 20) విచారణ అర్ధంతరంగా ముగియడంతో రెండు మూడు రోజులలో హరీష్ రావును సిట్ మరోసారి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే.. సుప్రీంకోర్టు కొట్టి వేసిన కేసులో హరీష్ రావును విచారణకు పిలిచారంటూ కేటీఆర్ సహా  బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని సిట్ చీఫ్  సజ్జనార్ ఖండించారు. తాము హరీష్ రావును విచారణకు పిలిచింది ఆ కేసులో కాదని క్లారిటీ ఇచ్చారు.  ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసిన కేసులో హరీష్ రావును విచారించామనీ, ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని సజ్జనార్ అన్నారు.  
Publish Date: Jan 21, 2026 9:17AM

క‌విత‌క్క కొత్త పార్టీకి.. పీకే ఐడియాలజీ?

సొంత రాష్ట్రంలో సొంతంగా పార్టీ పెట్టి దానిని ఎన్నికలలో గెలుపు బాటలో నడిపించలేక చతికిలపడి, ఇప్పుడా పార్టీని ఎలా నడపాలో తెలియక అయోమయంలో ఉన్న ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే.. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్న కల్వకుంట్ల కవితకు ఐడియాలజిస్టుగా ఉంటారట. సొంతంగా పార్టీని నడపడంలో విఫలమైన  ప్ర‌శాంత కిషోర్  ఐడియాలు, వ్యూహాలు కవిత పార్టీకి ఏ మేరకు పని చేస్తాయి? ఏ మేరకు పనికొస్తాయి అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో జోరుగా సాగుతోంది. సరే అసలు తాను కవిత పార్టీకి వ్యూహకర్తగా పని చేయనున్నానంటూ వస్తున్న వార్తలు శుద్ధ అబద్ధాలని ప్రశాంత్ కిశోర్ కొట్టి పారేశారనుకోండి అది వేరు సంగతి.   ఇటీవ‌ల క‌విత‌- ప్ర‌శాంత్ కిషోర్ మధ్య రెండు సమావేశాలు జరిగాయనీ, కవిత  త‌న పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్టుగా ఆయ‌న్ను నియ‌మించుకునే అవ‌కాశం క‌నిపిస్తోంద‌న్న వార్తలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో ప్రశాంత్ కిశోర్ ఖండించినప్పటికీ చర్చ మాత్రం ఆగడం లేదు.   ప్ర‌శాంత్ కిషోర్  జ‌న్ సూర‌జ్  పార్టీ ఇటీవ‌ల జ‌రిగిన  బీహార్ ఎన్నిక‌ల్లో సోదిలో కూడా క‌నిపించ‌లేదు. ఇక ఆయన స్వయంగా పార్టీ అభ్యర్థిగా ఎక్కడా పోటీ చేయలేదు.  స్వ‌త‌హాగా బీహారీ అయిన ప్ర‌శాంత్ కిషోర్ .. సాటి  బీహారీ అయిన  క‌విత‌కు.. (ఈ కామెంట్ ఎందుకు చేయాల్సి వ‌చ్చిందంటే కేసీఆర్ కుటుంబం కూడా బీహార్ నుంచే ఏపీలోని బొబ్బిలికి వ‌ల‌స వ‌చ్చిన‌ట్టు చెబుతారు. ఆ త‌ర్వాతే  వారు తెలంగాణ‌కొచ్చి సెటిలైన‌ట్టు అంటారు. అందుకే కేసీఆర్ గ‌తంలో బీహార్ లో కొంద‌రికి  ఆర్ధిక సాయం చేశారు కూడా) రాజ‌కీయ స‌ల‌హాదారుగా పని చేయడానికి ముందుకు వచ్చారన్న చర్చ జరుగుతోంది. సొంతంగా పార్టీ పెట్టడానికి ముందు వరకూ ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు బాగానే క్లిక్ అయ్యాయి. ఏపీలో జగన్, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, అంతకంటే ముందు 2014లో కేంద్రంలో మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిశోర్ వ్యాహాలే కారణమనే వారూ లేకపోలేదు. కానీ ఇంటి వైద్యం ఒంటపట్టదన్నట్లు ఆయన వ్యూహాలు ఆయన సొంత పార్టీకి ఏ మాత్రం ఉపయోగపడలేదు.  సరే అది పక్కన పెట్టి పార్టీలను అధికారంలోకి తీసుకురావడానికి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలలో సెంటిమెంట్ ప్రధానం అన్నది తెలిసిందే.  మొన్నా మ‌ధ్య క‌విత ఎమ్మెల్సీ ప‌ద‌వికి  రాజీనామా చేస్తూ.. తాను ఆస్తి కోసం పోరాడ్డం లేద‌ని ఆత్మ‌గౌర‌వం కోసం కొట్లాడుతున్నాన‌ని ప్ర‌క‌టించ‌డ‌మే  కాకుండా.. క‌న్నీటి  ప‌ర్యంత‌రం అయ్యారు.  ఒక మ‌హిళ ఇంత పెద్ద ఎత్తున ఒక నిండు స‌భ‌లో క‌న్నీటి ప‌ర్యంతం కావ‌డం ఏమంత చిన్న విష‌యం కాదు. ఈ విజువ‌ల్  ప‌బ్లిక్ లోకి బలంగా వెడుతుంది.  సెంటిమెంట్ రగులుస్తుంది.   ఆ సెంటిమెంట్ నే కవిత  తెలంగాణ  రాజ‌కీయాల్లో రాణించేందుకు మరింత రగిల్చేలా పీకే వ్యూహాలకు పదును పెట్టే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక  మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు. బీసీల కోసం కొట్లాట ఇవ‌న్నీ  కూడా ప్ర‌శాంత్ కిషోర్ అంబుల పొదిలోని ఆస్త్రాలుగానే చెబుతున్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిశోర్   కేసీఆర్ తో జ‌త క‌ట్టి ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహ‌ర‌చ‌న చేస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఎందుకంటే కేసీఆర్ అప్ప‌ట్లో జాతీయ  రాజ‌కీయాల వైపున‌కు వెళ్లే ఆలోచ‌న చేశారు. కానీ ఇదే క‌విత అన్న‌ట్టు ఇక్క‌డేం పీకినం అని దేశ రాజ‌కీయాల్లోకి బోవాలె అన్న‌ట్టు.. గులాబీ బాస్ ఎందుకో వెన‌క‌డుగు వేశారు. ఆపై అక్క‌డ మాట దేవుడెరుగు- ఇక్క‌డ కూడా కేసీఆర్ కార్ పార్టీ చ‌తికిల‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు క‌విత వ్యూహాల వద్దకు వ‌స్తే.. ప్ర‌శాంత్ కిషోర్ స‌ల‌హా సూచ‌న‌లు ఎంత మేర వ‌ర్క‌వుట్ అవుతాయ‌న్న‌ది ప్రశ్నార్థకమే. నీటిలో ఉన్న బ‌ర్రెకు రేటు క‌ట్ట‌డం క‌ష్ట‌మేమోగానీ..  అది బ‌య‌ట‌కొచ్చాక దాని పొదుగు చూసి ఆ ధ‌ర ఇట్టే చెప్పొచ్చు అన్న‌ట్టు.. ప్ర‌శాంత్ కిషోర్ ఒక  రాజ‌కీయ అనామ‌కుడు. అప్ప‌ట్లో మోడీకి, ఆ మ‌ధ్య  జ‌గ‌న్ కి అత‌డిచ్చిన ఒక‌టీ అరా స‌ల‌హా సూచ‌ల‌ను అడ్డి మార్- గుడ్డి దెబ్బ లెక్క‌  వ‌ర్క‌వుట్ అయి ఉండొచ్చు. అంత మాత్రం చేత ఇప్పుడు కూడా ఆయ‌న స‌ల‌హా సూచ‌న‌లు, భారీ మందీ మార్బ‌లం, ఆపై అణువ‌ణువూ లెక్క‌లు తీసి వాటి ద్వారా ఏదో చేయాల‌న్న వ్యూహాలు.. ఇవ‌న్నీ కూడా బెడిసి కొట్టి చాలా కాల‌మే అయ్యింది. ఇప్పుడీ రాజ‌కీయ వ్యూహాల‌కు బుట్ట‌లో ప‌డే ఓట‌రు మ‌హాశ‌యులెవ‌రూ లేరు.కాబ‌ట్టి క‌విత ఆయన వ్యూహాల కోసం అర్రులు చాచడం అనవసర మంటున్నారు పరిశీలకులు. కాదని ఒక వేళ కవిత ప్రశాంత్ కిశోర్ ను వ్యూహకర్తగా నియమించుకున్నా, ఆయనకు ఇచ్చే భారీ ఫీజు బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారుతుందంటున్నారు.  ఫైన‌ల్ గా సీఎం దావోస్ ప‌ర్య‌ట‌న శుద్ధ దండ‌గ అంటున్న క‌విత‌.. తాను ప్ర‌శాంత్ కిషోర్ కి వెచ్చించే సొమ్ము కూడా బీహారార్ప‌ణం అవుతుందని గ్రహించాల్సి ఉంటుందంటున్నారు. 
Publish Date: Jan 20, 2026 2:07PM

ఫోన్ ట్యాపింగ్.. న్యూస్ ట్యాపింగ్ చెల్లుకు చెల్లు!

ఫోన్ ట్యాపింగ్  కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ అగ్ర‌నేత‌ల్లో ఒక‌రైన హ‌రీష్ కి సిట్ నోటీసులు జారీ చేసింది. ట్యాపింగ్ కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. ఆయ‌న‌కిలా సిట్ నోటీసులు జారీ చేయ‌డం  ఇదే తొలిసారి. అయితే ఈ నోటీసులు జారీ కావడానికి ముందు సిద్దిపేట ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ హ‌రీష్ రావు  మంత్రుల్లో వాటాల కొట్లాట జరుగుతోందనీ,   మంత్రి సురేఖ పీఏ  వ్య‌వ‌హారం నుంచి మొద‌లు పెడితే  తాజాగా  కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి సినిమా  టికెట్ ధ‌ర‌ల పెంపు ద‌లలో వాటాల అంశం వ‌ర‌కూ  వాటాల కోసం గొడ‌వ ప‌డుతున్నార‌ంటూ ఓ జాబితా  ఏక‌ర‌వు పెట్టారు హ‌రీష్‌. అంతే కాదు.. మీరు ప్ర‌తిదానిపైనా సిట్ వేస్తుంటారు క‌దా... సింగ‌రేణి బొగ్గు కాంట్రాక్టు ప‌నుల్లో జ‌రిగే అవినీతిపై  కూడా సిట్ వేయాల‌ని  సవాల్ చేస్తూ..సిట్ కాదు సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.  ఇదిలా ఉంటే ఇటీవ‌ల బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్  ఫోన్ ట్యాపింగ్ ఎంక్వ‌యిరీ కాదు.. ఈ రాష్ట్రానికి అత్య‌వ‌స‌రంగా  కావ‌ల్సింది న్యూస్ ట్యాపింగ్ మీద ఎంక్వ‌యిరీ అంటూ  ట్వీట్ చేశారు. ఆ తరువాత    హ‌రీష్ కి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో సిట్   నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పుడు బీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఒక వార్ న‌డుస్తోంది. త‌మ‌కున్న మీడియా ప‌లుకుబ‌డి  ద్వారా... న్యూస్ ట్యాపింగ్ జ‌రుగుతోందంటూ ఓ ప్రచారాన్ని మొదలెట్టింది కారు పార్టీ. ఈ విష‌యంలో బీఆర్ఎస్ ఎక్కువ‌గా ఇరుక్కోకుండా  ఈ ప‌థ‌క ర‌చ‌న చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇదే అంశంలో ఇక్క‌డి  నుంచి జ‌గ‌న్ మద్దతు కూడా కారు పార్టీకి ఉన్నట్లు సమాచారం.  దీంతో కారు- ఫ్యాను పార్టీలు రెండూ క‌ల‌సి తెలంగాణ‌లో ఒక అల‌జ‌డి సృష్టించేందుకే.. వెంక‌ట‌రెడ్డి- మ‌హిళా ఐఏఎస్ వ్య‌వ‌హారం తెర‌పైకి తెచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. దెబ్బ‌కు దెబ్బ తీసేలా ఈ తేనెతుట్టె క‌దిపిన‌ట్టు స‌మాచారం. ఇందుకు స‌ర్కార్ కూడా అటు వైపు నుంచి న‌రుక్కొస్తోంది. త‌మ‌కున్న మీడియా బ‌లం ద్వారా.. దీన్ని తిప్పి కొట్టే య‌త్నం చేస్తోంది. దీంతో ఇద్ద‌రు మీడియా అధినేత‌లు చెరో వైపూ చీలి.. కొట్లాడుతున్న దృశ్యం తెలంగాణ‌లో తొలిసారి క‌నిపిస్తోంది.
Publish Date: Jan 20, 2026 1:55PM

తెలంగాణ మునిసిపోల్ బరిలో తెలంగాణ జాగృతి

తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మునిసిపోల్ బరిలో తెలంగాణ జాగృతి అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా నిజామాబాద్ మునిసిపల్ బరిలో స్పష్టమైన ప్రభావం చూపే దిశగా అధిక సంఖ్యలో వార్డు సభ్యులను బరిలోకి దింపాలని నిర్ణయించారు. సోమవారం (జనవరి 20) హైదరాబాద్ లోని తన నివాసంలో తెలంగాణ జాగృతి కీలక నేతలతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్ మునిసిపోల్స్ లొ కనీసం 30 వార్డులలో తెలంగాణ జాగృతి అభ్యర్థులను పోటీలో నిలపాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అభ్యర్థుల ఎంపికను మునిసిపోల్స్ కు నోటిఫికేషన్ వెలువడడానికి ముందే ఖరారు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మునిసిపోల్స్ లో ఉనికిని బలంగా చాటడం ద్వారా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని కవిత భావిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.  
Publish Date: Jan 20, 2026 11:29AM

అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్

తమిళనాడు అసెంబ్లీ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేశారు. ఔను తమిళనాడు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగించాల్సిన గవర్నర్ మధ్యలోనే వాకౌట్ చేశారు. ఈ విషయమై లోక్ భవన్ విడుదల చేసిన ప్రకటనలో దేశంలోని అన్ని శాసన సభలలో గవర్నర్ ప్రసంగానికి ముందు జాతీయ గీతాలాపన చేయడం సంప్రదాయంగా కొనసాగుతోందనీ, కానీ  స్టాలిన్ సర్కారు మాత్రం ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసిందనీ,  దీనికి నిరసనగా గవర్నర్ ఆర్.ఎన్.రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినట్లు  పేర్కొంది.  అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో సభలో జాతీయ గీతాన్ని పాడకుండా ప్రభుత్వం అవమా నించిందని లోక్ భవన్ విమర్శించింది.  అసెంబ్లీలో తరచూ జాతీయగీతాన్ని అవమానిస్తుండడాన్ని సహించలేక గవర్నర్‌ సభలో నుంచి వెళ్లిపోయారని తెలిపింది.  ఇలా ఉండగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గవర్నర్ తీరును తప్పుపట్టారు. సభను ఉద్దేశించి ప్రసంగించకుండా వాకౌట్ చేయడం ద్వారా గవర్నర్ రవి సభా సాంప్రదాయాన్ని, నైతికతను  ఉల్లంఘించారని విమర్శించారు. ప్రభుత్వం రూపొందించే ప్రసంగ కాపీలో గవర్నర్ అభిప్రాయాలను చేర్చాలన్న నిబంధన ఎక్కడా లేదన్న స్టాలిన్, గవర్నర్ ఆర్‌.ఎన్‌.రవి ఉద్దేశపూర్వకంగానే సభను అవమానించడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని సీఎం ఎం.కే.స్టాలిన్ మండిపడ్డారు. మొత్తం మీద అసెంబ్లీ నుంచి  గవర్నర్ వాకౌట్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా పెను వివాదంగా కూడా మారింది. 
Publish Date: Jan 20, 2026 11:15AM

కల్వకుంట్ల కవిత.. ప్రశాంత్ కిషోర్ భేటీ.. ఏం జరుగుతోంది?

తెలంగాణ జాగృతి అధినేత్రి పొలిటికల్ జర్నీకి ప్రఖ్యాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సహకారం అందించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది. స్వల్ప వ్యవధిలో ప్రశాంత్ కిషోర్, కల్వకుంట్ల కవిత మధ్య రెండు సార్లు భేటీ జరిగిందన్న వార్తల నేపథ్యంలో కవితకు రాజకీయ సలహాదారుగా, వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పని చేయనున్నారని పరిశీలకులు అంటున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా పలు రాష్ట్రాలలో ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్.. తన సొంత రాష్ట్రం బీహార్ లో మాత్రం సొంత పార్టీని ఎన్నికలలో విజయపథంలో నడిపించే విషయంలో ఘోరంగా విఫలమై బొక్కబోర్లా పడ్డారు.  సొంత పార్టీ జన సురాజ్ ను ఏర్పాటు చేసి, బీహార్ లో సుదీర్ఘ పాదయాత్ర చేసి, విస్తృత ప్రచారం చేసి కూడా ఇటీవలి ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ తన పార్టీ నుంచి కనీసం ఒక్కరంటే ఒక్క అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయారు. జనసురాజ్ అభ్యర్థులెవరూ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. దీంతో ప్రత్యక్ష ఎన్నికలకు గుడ్ బై చెప్పేసి మళ్లీ వ్యూహకర్త అవతారం ఎత్తడమే ప్రశాంత్ కిశోర్ ముందు ఉన్న మార్గమని పరిశీలకులు గత కొంత కాలం నుంచీ చెబుతూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిశోర్ కల్వకుంట్ల కవిత భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.   మాజీ ఎమ్యెల్సీ, మాజీ ఎంపీ, అన్నిటికీ మించి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె అయిన కల్వకుంట్ల కవిత, తన తండ్రి నేతృత్వంలోని బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణలో సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో  ప్రశాంత్ కిశోర్ తో ఆమె భేటీ ఎనలేని రాజకీయ ప్రాముఖ్యత సంతరించుకుంది.   ప్రశాంత్  రెండు నెలల వ్యవధిలో కవితతో రెండు సార్లు భేటీ అయ్యారనీ, వాటిలో రెండో భేటీ సంక్రాంతి సీజన్ లో జరిగిందనీ సమాచారం.   ఈ భేటీలలో వారిరువురి మధ్యా ప్రధానంగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, కొత్త పార్టీ అజెండా, ప్రచారం తదితర అంశాలపై చర్చ జరిగిందని చెబుతున్నారు.    ప్రశాంత్ కిషోర్  కు తెలుగు రాజకీయాలతో మంచి పరిచయం ఉంది.  గతంలో  అంటే  2019లో వైఎస్ జగన్  కు రాజకీయ, ఎన్నికల వ్యూహాలను అందించారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాల కారణంగానే 2019 ఎన్నికలలో జగన్ విజయం సాధించారని రాజకీయ పరిశీలకులు ఇప్పటికీ చెబుతుంటారు.  అలాగే  2023 ఎన్నికలకు ముందు కొద్ది కాలం పాటు ఆయన బీఆర్ఎస్ కు కూడా వ్యూహకర్తగా పని చేశారు.   ఇక ప్రస్తుతానికి వస్తే... కవిత రాజకీయంగా సొంత మార్గం వేసుకుని సొంతగా నడక ప్రారంభిం చనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె తన రాజకీయ   వ్యూహాలకు పదును పెట్టడమే కాకుండా, తాను ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీని ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లేలా వ్యూహరచన చేయడానికి ప్రశాంత్ కిశోర్ ను నియమించుకున్నారన్న చర్చ ఈ భేటీల  అనంతరం రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.   అయితే తాను కల్వకుంట్ల కవితకు రాజకీయ వ్యూహకర్తగా పని చేయనున్నట్లు వస్తున్న వార్తలను ప్రశాంత్ కిశోర్ ఖండించారు. తాను ఇప్పటికే రెండు సార్లు ఆమెతో భేటీ అయ్యి పార్టీ ఏర్పాటు గురించి చర్చించినట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టి పారేశారు.  
Publish Date: Jan 20, 2026 10:12AM

హరీష్ నివాసానికి కేటీఆర్!

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. పొలిటికల్ హీట్ ను పెంచింది.  మాజీ మంత్రి  హరీష్ రావు  సిట్ నోటీసుల మేరకు నేడు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో తెలంగాణ భవన్ , జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.   2024 మార్చి 10న నమోదైన ఎఫ్ఐఆర్  ఆధారంగా సిట్ ఈ నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది.   గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో  హరీష్ ప్రమేయంపై సిట్ అధికారులు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.  హరీష్ రావును  జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.  ఇకపోతే తెలంగాణ భవన్ వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు చేశారు. అదలా ఉంటే.. హరీష్ రావు సిట్ విచారణకు బయలుదేరడానికి ముందుగానే మరో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు హరీష్ రావు నివాసానికి చేరుకున్నారు. హరీష్ రావుకు సిట్ నోటీసులను కక్ష సాధింపు చర్యగా ఆయన అభివర్ణించారు.  కేటీఆర్ మాత్రమే కాకుండా పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా హరీష్ నివాసానికి చేరుకున్నారు. వీరంతా కలిసి జూబ్లీ పోలీసు స్టేషన్ కు బయలుదేరారు. కాగావిచారణలో భాగంగా సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారు? హరీష్ రావు విచారణకు సహకరిస్తారా?  అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 
Publish Date: Jan 20, 2026 9:24AM

ఫోన్ టాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు

తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసులో తాజాగా మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ ఆ నోటీసులో పేర్కొంది. సిట్ హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  ఫోన్ టాపింగ్ వ్యవహారానికి సంబంధిం చిన పలు అంశాలపై హరీష్ రావు నుంచి వివరణ తీసుకో నుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో  ఇప్పటికే పలువురు అధికారులను విచారించిన సిట్, తాజాగా రాజకీయ నేతల వైపు దృష్టి సారించింది. ఇలా ఉండగా  హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్  మండి పడ్డారు.   రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండాగా మారిపోయిందంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు. ఫోన్ ట్యాపింగ్  కేసులో పస లేదనీ,  అది కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమేననీ పేర్కొన్న కేటీఆర్ ఈ విషయం తాను కాదనీ, సాక్షాత్తూ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడమే కాకుండా కేసును కూడా కొట్టేసిందన్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతోనే ఈ డ్రామా ముగిసిపోయినా, మళ్లీ హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎంతగా  దిగజారిందో అర్థమవుతోందని పేర్కొన్నారు.  రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డి కి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని  బయటపెట్టినందుకే, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించే హరీష్ రావుకు నోటీసులు అని ఆరోపించారు.  అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం లో కానీ, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడటంలో కానీ  హరీష్ రావు చూపుతున్న చొరవ సీఎం రేవంత్ రెడ్డికి వణుకు పుట్టిస్తోందన్న కేటీఆర్, హరీష్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే,  ఇలాంటి తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. గత రెండేళ్లుగా  రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ దారుణమైన పాలనను నిలదీస్తున్నందుకే హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ   కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్న కేటీఆర్, తమకు  చట్టం పైన, న్యాయస్థానాల పైన పూర్తి గౌరవం ఉంది, అందుకే ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం  చేశారు.  
Publish Date: Jan 20, 2026 8:56AM

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఏకగ్రీవ ఎన్నిక

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు నడ్డా స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ సోమవారం (జనవరి 19) ముగిసింది.  ఈ నామినేషన్ల ప్రక్రియ ముగిసే సరికి ఆ పదవి కోసం నితిన్ నబిన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.   బీజేపీ జాతీయ అధ్యక్ష  ఎన్నికకు ప్రధాన ఎన్నికల అధికారిగా   కె.లక్ష్మణ్‌ వ్యవహరించారు. ఇక పోతే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఎన్నికను మంగళవారం (జనవరి 20) ఉదయం ప్రధాని మోడీ  సమక్షంలో అధికారికంగా ప్రకటిస్తారు.  ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర పార్టీల అధ్యక్షులు,   ప్రధాన కార్యదర్శులు,  ఇన్‌చార్జ్‌లు, జాతీయ ఆఫీస్ బేరర్లు,  సీనియర్ నాయకులు హాజరవుతారు.  
Publish Date: Jan 19, 2026 4:54PM

తెలంగాణ స్పీకర్‌కి సుప్రీం నోటీసులు

తెలంగాణలో బీఆర్ఎస్  ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీం కోర్టులో సకీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీం ధర్మాసనం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం (జనవరి 19) విచారణ చేపట్టింది. గతంలో పెండింగ్‌లో ఉన్న కేసుతో బీజేపీ పిటిషన్‌ను కూడా జత చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. మూడు నెలల్లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించినప్పటికీ.. ఆ ఆదేశాలను అమలు చేయలేదని బీజేపీ   తన పిటిషన్ లో పేర్కొంది.   ఈ మేరకు స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరుతూ తెలంగాణ బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నానని చెప్పిన కామెంట్లనూ  పిటిషన్‌లో పొందుపరిచారు. గత నవంబర్‌లోనే స్పీకర్‌కు సుప్రీం కోర్టు కంటెంప్ట్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ పిటిషన్‌ను జతచేసి మరోసారి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
Publish Date: Jan 19, 2026 2:17PM