మాస్క్ లేకుంటే మటాషే.. గాలి ద్వారా కరోనా వ్యాప్తి! 

దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి సంబంధించి మరో షాకింగ్ న్యూస్. ఇది జనాలను మరింత కలవరపరిచే వార్తే. కరోనా మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండకపోతే తెలంగాణకు మహారాష్ట్ర పరిస్థితి వస్తుందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పడకల కొరత ఏర్పడుతుందన్నారు డా.శ్రీనివాస్‌. రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల్లో కరోనా రోగులకు పడకల కొరత ఏర్పడిందన్నారు.  గతంతో పోల్చితే ప్రస్తుత వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని చెప్పారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్. ఇంట్లో ఒకరికి వైరస్‌ సోకితే గంటల్లోనే మిగతా వారికి వ్యాపిస్తుందని వెల్లడించారు. ఇప్పటివరకు బయట మాత్రమే మాస్క్‌ వేసుకోమని చెప్పామని..ఇకపై ఇంట్లో ఉన్నా మాస్క్‌ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని.. మరో 4 నుంచి 6 వారాల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. ప్రజల జీవనోపాధి దెబ్బతినకూడదనే లాక్‌డౌన్ పెట్టడం లేదన్నారు. ప్రజలు స్వీయనియంత్రణ పాటించకపోతే పరిస్థితి విషమిస్తుందని  డా.శ్రీనివాస్‌ హెచ్చరించారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా కేసులు మళ్లీ పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఫస్ట్ వేవ్ సమయంలో 20 శాతం మంది పేషెంట్లు ఆసుపత్రుల్లో చేరారని... సెకండ్ వేవ్ లో 95 శాతం మంది ఇంటి వద్దే ఉంటూ చికిత్స పొందుతున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 47 వేల పడకల్లో సగానికి పైగా కోవిడ్ పేషెంట్లకే వాడుతున్నామని తెలిపారు. సీరియస్ కేసులు వస్తే... ప్రైవేట్ ఆసుపత్రులు గాంధీ ఆసుపత్రికి పంపుతున్నాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ధర్నాలు చేయవద్దని కోరారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
Publish Date:Apr 14, 2021

భగత్ గాలి బాగానే ఉంది..

నాగార్జునసాగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి జానారెడ్డి చేసింది ఏమీ లేదన్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 30 ఏళ్ల అనుభవమున్న జానారెడ్డి.. హాలియాకు డిగ్రీ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారని తప్పుబట్టారు. నాగార్జున సాగర్‌కు త్వరలోనే డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తామన్నారు సీఎం కేసీఆర్.  సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియా పరిధిలోని అనుములలో నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్‌ మాట్లాడారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని.. పరిణతితో ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. ఓటు వేసే ముందు న్యాయం ఎవరివైపు ఉందో ఆలోచించాలన్నారు. నాగార్జున సాగర్‌లో సంక్షేమ పథకాలు అందడంలేదా..? పైరవీలు లేకుండా పాలన సాగిస్తున్నాం.’’అని కేసీఆర్ అన్నారు.  నోముల భగత్‌కు ఏవిధంగా ఓట్లు పడతాయో అదే విధంగా నెల్లికల్లు లిఫ్ట్ నీళ్లు కూడా దూకుతాయని కేసీఆర్ హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో భగత్‌ గాలి బాగానే ఉందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. మిత్రుడు నోముల నర్సింహయ్యను కోల్పోవడం బాధాకరమని చెప్పారు. వామపక్ష పార్టీల్లో ఉంటూ ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆయన తనయుడు, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను ఆశీర్వదించాలని కోరారు. 
Publish Date:Apr 14, 2021

రంజాన్ ప్రార్థనలకు హైకోర్టు నో

రంజాన్ సామూహిక ప్రార్థనలకు అనుమతించాలని కోరుతూ ఓ మసీదు ట్రస్టు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కొవిడ్-19 ఉధృతి తీవ్ర స్థాయిలో ఉన్నందున సామూహిక ప్రార్థనలకు అనుమతించడం కుదరదని తేల్చి చెప్పింది. మత విశ్వాసాన్ని అనుసరించే హక్కు ముఖ్యమే అయినా.. పౌరుల సంక్షేమం అంతకంటే ముఖ్యమని ధర్మాసనం స్పష్టం చేసింది.  రంజాన్ మాసం దృష్ట్యా తమ మసీదులో రోజుకు ఐదు సార్లు ప్రార్థనలు చేసుకునేందుకు ముస్లింలకు అనుమతి ఇవ్వాలంటూ దక్షిణ ముంబైలోని జుమా మసీదు ట్రస్ట్ బోంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం.. ‘‘ మత విశ్వాసాలు అనుసరిస్తూ, వేడుకలను జరుపుకునే హక్కు ముఖ్యమైనదే అయినప్పటికీ.. ప్రజా భద్రత, పౌరుల సంక్షేమం అంతకంటే ముఖ్యమైన, సర్వోన్నతమైనదని గమనించాలి.’’ అని కోర్టు అభిప్రాయపడింది. తమ మసీదు ఎకరం స్థలంలో విస్తరించి ఉందనీ.. ఒకేసారి 7 వేల మంది సమావేశమయ్యేందుకు సరిపోతుందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఒక్కో విడతకు కనీసం 50 మందినైనా రంజాన్ సమయంలో ప్రార్థనలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ట్రస్ట్ కోరింది. కొవిడ్-19కి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కూడా కోర్టుకు విన్నవించింది. అయితే పిటిషనర్ వాదనను అదనపు ప్రభుత్వ ప్లీడర్ జ్యోతి చవాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. మహారాష్ట్రలో ప్రత్యేకించి ముంబైలో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని ఆమె కోర్టుకు నివేదించారు. ‘‘ఏ మతానికి మేము మినహాయింపు ఇవ్వలేము. ప్రత్యేకించి ఈ 15 రోజుల్లో అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఈ దశలో మేము ఎలాంటి రిస్క్ తీసుకోలేం. ప్రజలంతా సహకరించాలి.’’ అని చవాన్ అన్నారు.  ప్రజలు తమ విశ్వాసాలను కొనసాగించడంపై ప్రభుత్వం ఎలాంటి నిషేధం విధించలేదని.. అయితే వాటిని ప్రజలు తమ ఇళ్ల దగ్గరనే చేసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ న్యాయవాది వాదనతో ఏకీభవించిన ధర్మాసనం... ప్రస్తుతం కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నందున పిటిషనర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేమంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. కొవిడ్-19 సంక్షోభం కారణంగా గతంలో కూడా దేశంలోని అనేక కోర్టులు మతాలకు అతీతంగా సామూహిక ప్రార్థనలకు అనుమతి నిరాకరించిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది.
Publish Date:Apr 14, 2021

వామ్మో.. ఏపీలో 4 ,157  కేసులు.. 18 మరణాలు.. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వైరస్‌ విలయతాండవం చేస్తుంది. కరోనా భారీన బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,732 పరీక్షలు నిర్వహించగా.. 4,157 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,37,049 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల నెల్లూరులో నలుగురు చనిపోగా.. చిత్తూరు, కృష్ణాలో ముగ్గురేసి, విశాఖలో ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,339కి చేరింది.   24 గంటల వ్యవధిలో 1,606 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,01,327కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 28,383 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,55,34,460 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా తూర్పు గోదావరిలో 617, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 60 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పశ్చిమ గోదావరి మినహా మిగతా అన్ని జిల్లాల్లో వందకుపైగా కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 
Publish Date:Apr 14, 2021

తిరుపతి ప్రీపోల్ సర్వే.. గెలిచేది ఎవరంటే..

తిరుపతి పార్లమెంట్ స్థానంలో హోరాహోరీ పోరు. తిరుపతి విజయం అన్ని పార్టీలకూ కీలకం. నేతలంతా గెలుపు కోసం గట్టిగా క‌ృషి చేస్తున్నారు. ఎవరి లెక్కలు వారివే. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. పార్టీలు, నాయకుల మాటలా ఉంచితే.. మరి, తిరుపతి ఓటర్లు ఎటు వైపు? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ప్రి-పోల్ సర్వేలు ఏం చెబుతున్నాయి? అనేది ఆసక్తికరంగా మారింది. 'అసోషియేషన్ ఫర్ ఎలక్టోరల్ స్టడీస్' చేసిన ప్రీ పోల్ సర్వేలో ఓటర్ల నాడి స్పష్టమైంది.  సర్వేలో.. తిరుపతిలో ఎవరు గెలుస్తారంటూ ప్రశ్నించింది 'అసోషియేషన్ ఫర్ ఎలక్టోరల్ స్టడీస్'. 45శాతం ప్రజలు టీడీపీకే పట్టం కట్టారు? తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి గెలుస్తారని చెప్పారు తిరుపతి ఓటర్లు. వైసీపీ వైపు 39.2శాతం మంది మొగ్గు చూపారు. బీజేపీ-జనసేనకు కేవలం 1.3శాతం మాత్రమే జై కొట్టారు. కాంగ్రెస్‌కు 0.7 మద్దతు పలకగా.. 13.8శాతం చెప్పలేమని చెప్పారు.  ఇక, టీడీపీకి ఓటేస్తామంటూ 47.8శాతం ప్రజానీకం స్పష్టం చేయండం చూస్తుంటే.. ఓటర్లలో తెలుగుదేశానికి పెరిగిన ఆదరణ స్పష్టం అవుతోంది. వైసీపీకి ఓటేసేందుకు 44.7శాతం మంది ఇంట్రెస్ట్ చూపడం ప్రజల్లో అధికార పార్టీ పరపతి కోల్పోతోంది అనడానికి నిదర్శణం. బీజేపీ-జనసేనకు ఓటేసేందుకు కేవలం 4.4శాతం ఆసక్తి కనబరిచారు.  తిరుపతిలో కులాల వారీగానూ ఓటరు నాడీ పట్టే ప్రయత్నం చేసింది 'అసోషియేషన్ ఫర్ ఎలక్టోరల్ స్టడీస్'. సర్వేలో అధిక శాతం రెడ్లు, మాలలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపారు. వైసీపీకి 60.5శాతం రెడ్లు ఓటేస్తామని ముందుకు రాగా, 31.1శాతం మంది రెడ్లు మాత్రం టీడీపీకే జై కొట్టారు. 57.1శాతం మాలలు గురుమూర్తి వైపు ఉండగా, పనబాకకు 38.7శాతం మాలలు ఆసక్తి చూపారు. ఇక, మాదిగలు మాత్రం అధిక సంఖ్యలో తెలుగుదేశానికి అండగా ఉండబోతున్నారు. సర్వేలో 59.6శాతం మాదిగలు తాము టీడీపీకే ఓటు వేస్తామని చెప్పారు. వైసీపీకి 35.2శాతం మాదిగలు మద్దతు పలికారు. యాదవ ఓటర్లలో 57శాతం టీడీపీకి, 37.3శాతం వైసీపీకి సపోర్ట్‌గా ఉన్నారు. ఇక, యానాడిలు మాత్రం 2శాతం తేడాతో టీడీపీ వైపు అధికంగా మొగ్గు చూపారు.  ఇక, వర్గాల వారీగానూ ఓటర్ల చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. రైతులు అధిక సంఖ్యలో టీడీపీకి మద్దతుదారులుగా నిలిచారు. 49.5శాతం మంది రైతులు తెలుగుదేశానికి ఓటేస్తామని చెప్పగా, 43.04శాతం రైతులు అధికార పార్టీకే తమ ఓటన్నారు. వ్యాపారుల్లో మాత్రం కాస్త వైసీపీ వైపే మొగ్గు కనబడింది. 47.2శాతం మంది ట్రేడర్స్ వైసీపీకి జై కొట్టగా, టీడీపీకి 45.2 శాతం వ్యాపారులు అండగా నిలిచారు.  ఇసుక విధానంతో తీవ్రంగా నష్టపోయిన రోజువారీ కూలీలు తిరుపతి ఎన్నికల్లో అధికార వైసీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధమైనట్టు ప్రీపోల్ సర్వేలో స్పష్టమవుతోంది. 44.7శాతం కూలీలు వైసీపీకి ఓటేస్తామంటే, 49.04శాతం కూలీలు టీడీపీ వైపు ఉన్నామన్నారు. 49.25శాతం మంది ప్రైవేట్ ఉద్యోగులు తెలుగుదేశానికి సపోర్ట్ చేయగా, వైసీపీకి 44.4శాతం సై అన్నారు. 49.2 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం అధికార పార్టీకే ఓటేస్తామన్నారు. టీడీపీకి 45.5శాతం మద్దతు పలికారు. గృహిణిలు పెద్ద సంఖ్యలో 48.5శాతం మేర తెలుగుదేశానికి సపోర్ట్ చేయగా, వైసీపీకి 45.2శాతం ఓకే చెప్పారు. ఇక, ఓవరాల్‌గా అన్ని వర్గాలకు చెందిన మహిళల్లో 44.3శాతం వైసీపీకి, టీడీపీకి 48.7శాతం ఓటేసేందుకు సిద్ధమన్నారు. పురుషుల్లో టీడీపీకి 47.8శాతం, వైసీపీకి 44.7శాతం సపోర్టర్స్‌గా ఉన్నట్టు 'అసోషియేషన్ ఫర్ ఎలక్టోరల్ స్టడీస్' స్పష్టం చేస్తోంది. ఇక, అన్ని కేటగిరిల్లోనూ బీజేపీ, కాంగ్రెస్, ఇతరులు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి.  తిరుపతి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ వారీగానూ ప్రీ పోల్ సర్వే నిర్వహించింది 'అసోషియేషన్ ఫర్ ఎలక్టోరల్ స్టడీస్'. నియోజక వర్గాల వారీగా ఓటర్ల నాడి మారిపోతోంది. అయితే, అధిక శాతం ఓటర్లు టీడీపీ వైపే ఆసక్తిగా ఉండటం ఆసక్తికరం. సర్వేపల్లి అసెంబ్లీ పరిధిలో 52.9శాతం మంది టీడీపీ గెలుస్తుందని చెప్పగా, 43.5శాతం వైసీపీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. వెంకటగిరి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 53.6శాతం టీడీపీకే ఓటేస్తామని చెప్పగా, కేవలం 41.5శాతం మంది వైసీపీకే తమ ఓటన్నారు. సూళ్లూర్‌పేట్‌లో వైసీపీ ఆధిపత్యం కనిపిస్తోంది. అక్కడ టీడీపీకి 43.4శాతం, వైసీపీకి 47.1శాతం మంది ఓటర్లు పట్టం కట్టారు. సత్యవేడులో 46.1శాతం మంది వైసీపీనే గెలుస్తుందని భావిస్తున్నా.. అక్కడి వారిలో 53.6శాతం తాము టీడీపీకే ఓటేస్తామని చెప్పడంతో అక్కడి ఓటర్ల నాడి పట్టడం కష్టంగా కనిపిస్తోంది. ఇక, శ్రీకాళహస్తి, గూడూర్ అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో 1శాతం తేడాతో హోరాహోరీ పోరు నడుస్తోంది. కీలకమైన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం దూసుకుపోతోంది. తిరుపతిలో ఏకంగా 53.3శాతం టీడీపీకి ఓటేస్తామని సర్వేలో తేల్చి చెప్పారు. వైసీపీకి 41శాతం మంది మాత్రమే మద్దతు ప్రకటించారు.  ఇలా.. వర్గాలు, ప్రాంతాల వారీగా చూస్తే.. తిరుపతి పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని 'అసోషియేషన్ ఫర్ ఎలక్టోరల్ స్టడీస్' ప్రీ పోల్ సర్వేలో తేలిపోయింది. అధికార వైసీపీ రెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సిందే. మిగతా పార్టీలు సోదిలోకి కూడా లేకుండా పోయేలా ఉన్నాయి. 
Publish Date:Apr 14, 2021