ఈసారి రిప‌బ్లిక్ డే ప్ర‌త్యేక‌త‌లు ఇవే.. ఔరా అనిపించాల్సిందే..

దేశ రాజధాని ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ ప‌తాకానికి వందనం చేసి వేడుకలు ప్రారంభించారు. విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలు ప్రదానం చేశారు.  2020 ఆగస్టులో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన జమ్మూకశ్మీర్‌ పోలీసు ఏఎస్‌ఐ బాబురామ్‌కు మ‌ర‌ణానంత‌రం అశోక్‌ చక్ర పురస్కారం వరించింది. బాబురామ్‌ కుటుంబసభ్యులు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని స్వీకరించారు.    రాజ్‌పథ్‌లో రిప‌బ్లిక్ డే పరేడ్ వేడుక‌గా జ‌రిగింది. దేశ సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పేలా పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. వాయుసేన విన్యాసాలు, శకటాల ప్రదర్శనతో పరేడ్‌ ఆకట్టుకుంది.    దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ ఏడాదికి 75ఏళ్లు పూర్తికానుంది. ఈ సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 73వ గణతంత్ర వేడుకల్లో పలు ప్రత్యేకతలు చోటుచేసుకున్నాయి.   రిపబ్లిక్‌ డే కవాతులో మొదటిసారిగా భారత వాయుసేనకు చెందిన 75 విమానాల విన్యాసాలు జరిగాయి. పాత విమానాల నుంచి ఆధునిక రఫేల్‌, సుఖోయ్‌, జాగ్వార్ ఫైట‌ర్ జెట్‌లు ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాయి.  ప్రతి ఏటా ఉదయం 10 గంటలకు పరేడ్‌ను ప్రారంభిస్తారు. ఈసారి ఢిల్లీలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అరగంట ఆలస్యంగా వేడుక‌లు స్టార్ట్ చేశారు.  దేశవ్యాప్తంగా పోటీల్లో ఎంపిక చేసిన 480 బృందాలతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వ‌హించారు.  రక్షణ, సాంస్కృతిక మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో 600 మంది ప్రముఖ చిత్రకారులు రూపొందించిన చిత్రాలు ప్రదర్శించారు.   రాజ్‌పథ్‌ మార్గంలో ఇరువైపులా పది భారీ ఎల్‌ఈడీ స్క్రీన్స్‌ ఏర్పాటు చేశారు. గణతంత్ర వేడుకల విశేషాలు, సాయుధ దళాలపై చిత్రీకరించిన లఘు చిత్రాలను ప‌రేడ్ ప్రారంభానికి ముందు ఎల్‌ఈడీ తెరలపై ప్రదర్శించారు.   అంత‌కుముందు, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అమరవీరులకు నివాళులర్పించారు. ఇండియాగేట్‌ సమీపంలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు వందనం చేశారు. 
Publish Date: Jan 26, 2022 11:23AM

ప‌ద్మ‌విభూష‌ణ్ 'కృష్ణ ఎల్లా' గురించి ఈ విష‌యాలు తెలుసుకోవాల్సిందే?

కొవాగ్జిన్ తయారీ సంస్థ‌ భారత్ బయోటెక్‌కు సీఎండీ కృష్ణ ఎల్లా, జేఎండీ సుచిత్ర ఎల్లా. ఔషధ రంగంలో విశేష కృషి చేసిన వారిద్దరినీ సంయుక్తంగా పద్మవిభూషణ్ వరించింది. కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించడంతో వారిద్దరి కృషికి ప్రశంసలు దక్కినట్లయింది. తమిళనాడులోని తిరుత్తణి దగ్గర ఓ పల్లెలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు కృష్ణ ఎల్లా. వ్యవసాయం మీద కృష్ణ ఎల్లకు మక్కువ ఎక్కువ. ఆ మక్కువతోనే ఆయన వ్యవసాయ శాస్త్రంలో ఉన్నత చదువులు చదివారు. కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బేయర్ ఫార్మా అగ్రికల్చర్ విభాగంలో కృష్ణ ఎల్లా ఉద్యోగంలో చేరారు. స్కాలర్ షిప్ రావడంతో అమెరికాలో ఎమ్మెస్ చేసి, పీహెచ్ డీ కూడా చేశారు. ఆ తరువాత తిరిగి భారతదేశానికి రాకూడదని ఆయన అనుకొన్నారట. అయితే..’ఏమన్నా చేసుకొందువు నీ ఇష్టం.. ఇండియాకు రమ్మన్న తల్లి మాట విని కృష్ణ ఎల్లా మాతృదేశానికి వచ్చేశారు. ఒక్క డాలర్ ధరకు వ్యాక్సిన్ తయారు చేస్తా అంటూ హైదరాబాద్ వచ్చి ఓ చిన్న ల్యాబ్ పెట్టుకొన్నారు కృష్ణ ఎల్ల. 12.5 కోట్ల అంచనాతో హెపటైటిస్ మందుల ప్రాజెక్టు ప్రపోజల్ పట్టుకొని పెట్టుబడి కోసం కృష్ణ ఎల్లా తిరిగారు. ఆయనను చూసి అందరూ నవ్వారు. చివరికి ఐడీబీఐ బ్యాంకు 2 కోట్లు రుణం ఇచ్చింది. నాలుగేళ్లు శ్రమించిన కృష్ణ ఎల్లా హైపటైటిస్ వ్యాక్సిన్ ను తయారు చేశారు. 1999లో ఏపీజే అబ్దుల్ కలాం వచ్చి ఆ వ్యాక్సిన్ ని మార్కెట్లోకి విడుదల చేయడం విశేషం. ఆ తరువాత 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి బయోటెక్ నాలెడ్జ్ పార్క్ ఏర్పాటు గురించి చ‌ర్చించారు కృష్ణ ఎల్లా. ఆయన సలహాతో హైదరాబాద్ నగర శివార్లలోని శామీర్ పేట్ రహదారి దగ్గర జీనోం వ్యాలీ వెలిసింది. జీనోమ్‌ వ్యాలీ రూపకల్పన కోసం చంద్రబాబు నాయుడు బాగా కృషి చేశారు. ఆ వ్యాలీ నుంచి 60 శాతానికి పైగా పిల్లల వ్యాక్సిన్ లు ప్రపంచానికి ఎగుమతులు అవుతున్నాయి. 65 దేశాలకు 400 మిల్లియన్ డోసుల ఎగుమతులు చేసింది భారత్ బయోటెక్ సంస్థ. క్రిష్ణ ఎల్లా భారత్ బయోటెక్ పేరుతో ముందు ఓ చిన్న ల్యాబ్ పెట్టుకున్నారు. దేశ భక్తితో పెట్టిన ఆ పేరుతో ఏర్పాటు చేసిన ఆ సంస్థ దేశం గర్వించేలా వందకు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకొంది. చికున్ గున్యా నుండి జికా వైరస్ వరకు ఎన్నో వ్యాక్సిన్ లు కనిపెట్టి.. వైరస్ ల మీద దండయాత్రే చేశారు కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా. వారిద్దరి సారథ్యంలో భారత్ బయోటెక్ సంస్త రూపొందించిన వ్యాక్సిన్లలో 65 పేటెంట్లు సాధించాయి. 2011 బిజినెస్ లీడర్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ లో 2008లో ప్రధాని అవార్డును అందుకున్నారు. కృష్ణ ఎల్లా కరోనా మహమ్మారి నియంత్రణకు తిరుగులేని వ్యాక్సిన్ కొవాగ్జిన్ ను అభివృద్ధి చేశారు. భారత్ బయోటెక్ సంస్థ అతి తక్కువ ధరకే కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చారు. కరోనా వైరస్ తో ప్రపంచం అతలాకుతలమైపోతున్న సమయంలో ప్రధాని మోదీ భారత్ బయోటెక్ సంస్థను సందర్శించడం ఓ పెద్ద న్యూసే అయింది.  హైదరాబాద్ పరిసరాల్లో 600 చదరపు కిలోమీటర్ల పరిధిలో జీనోం వ్యాలీ విస్తరించింది. ఐటి రంగానికి ధీటుగా వేలాది మందికి జీనోం వ్యాలీలో ఉపాధి లభిస్తోంది. ‘ఐ వాంట్ ఏపీ టు బీ నంబర్ వన్ ఇన్ బయోటెక్’ అని 2004 మార్చిలో చంద్రబాబు నాయుడు చెబితే కొంద‌రు న‌వ్వారు. ఇప్పుడా ఫ‌లితాలు చూస్తున్నారు. ఆ వ్యాలీలో విర‌బూసిన సంజీవ‌నే- కొవాగ్జిన్‌. ఆ టీకా సృష్టిక‌ర్త‌లు కృష్ణా ఎల్లా, సుచిత్ర ఎల్లాల‌కు ల‌భించిన గౌర‌వ‌మే- ప‌ద్మ‌విభూష‌ణ్‌.  
Publish Date: Jan 26, 2022 10:36AM

అయ్యేది కాదు.. కొత్త జిల్లాలతో పాత ఎత్తులు.. పనిచేస్తాయా?

అయ్యేది కాదు.. పొయ్యేది కాదు, అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేనే తుట్టెను కదిల్చింది. ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయకపొతే కొంపలేవో మునిగి పోతునట్లు, ప్రస్తుతమున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆగమేఘాల మీద  ‘ఆన్లైన్’ లో ఆమోదం తెలిపింది. అయితే, ఇది అయ్యేది కాదు. ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనాభా గణనకు 2020 జనవరిలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. జనాభా లెక్కల ప్రక్రియ ముగిసే వరకు గ్రామాలు, పట్టణాల భౌగోళిక సరిహద్దులు మార్చకూడదంటూ ఫ్రీజింగ్‌ (నిషేధ) ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్రం జరీ చేసినప్రీజింగ్ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ కూడా ‘ఫ్రీజింగ్’ మోమో జారీ చేసింది. దీంతోనే జిల్లాల ఏర్పాటు ప్రక్రి య అధికారికంగా నిలిచిపోయింది.  అంటే దేశ వ్యాప్తంగా జనాభా లెక్కల ప్రక్రియ ముగిసే వరకు  కొత్త జిల్లల ఏర్పాటు కుదిరే పని కాదు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఆయన గారి 40 మంది సలహాదారులకు తెలియదా? ఈ మేరకు కేబినెట్‌ నోట్‌’ను ఆన్లైన్’లో  సర్క్యులేట్ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు తెలియదా, ఆన్లైన్’లోనే ఆమోదం తెలిపిన మంత్రులకు తెలియదా అంటే అందరికీ తెలుసు. నిజానికి, ఇది కొత్త ట్రిక్ కాదు, గతంలోనూ ప్రయోగించి ఫెయిల్ అయిన పాత ట్రిక్కునే ప్రభుత్వం మళ్ళీ మరో మరో పైకి తీసింది.  నిజానికి, గతంలోనూ అప్పటి చిక్కులోంచి బయటపడేందుకు, ప్రజలదృష్టిని రియల్ ఇష్యూస్ నుంచి తప్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ఇదే ట్రిక్ ప్లే చేసింది. ఇటీవల రాష్ట్రంలోని అనేక ప్రాంతలను వరదలు ముంచెత్తిన సమయంలో ముఖ్యమంత్రి ప్యాలెస్ గడప దాటలేదు. ప్రజలను పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి తీరును విపక్షాలు విమర్శించాయి. రోమ్ చక్రవర్తి ఫిడేలు రాగాలను గుర్తు చేసి దెప్పి పొడిచాయి. బాధిత ప్రజలు ఆందోళన వ్యక్తపరిచారు. ఆ సమయంలో అమరావతిలో జరిగిన ఎంపీల సమావేశంలో, ముఖ్యమంత్రి ‘కొత్తజిల్లాల అంశాన్ని ప్రస్తావించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఎంత వరకు వచ్చిందని ఆరా తీశారు. ఆ తర్వాత ఆ విషయం మరిచి పోయారు. అంతకు ముందు పంచాయతీ ఎన్నికల సమయంలోనూ కొత్త జిల్లాల అంశాన్ని తెర మీదకు తెచ్చారు. అయితే, అప్పటి ఎన్నికల అధికారి రమేశ్‌ కుమార్‌ ‘సెన్సస్‌’ డైరెక్టర్‌ ఇచ్చిన ఫ్రీజింగ్‌ ఉత్తర్వులు ఉండగా, ఎన్నికల సమయంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేయడానికి వీల్లేదని అప్పటి సీఎ్‌సకు లేఖరాశారు. దీంతో ఆ ప్రక్రియను ఆపేశారు. ఫ్రీజింగ్‌ ఉత్తర్వులను ఇప్పటికీ కేంద్రం వెనక్కి తీసుకోలేదు. కరోనా కారణంగా జన గణన పూర్తిస్థాయిలో జరగడం లేదు. ఇప్పట్లో అయ్యే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అయినా ప్రభుత్వం కొత్త జిల్లాల అంశాన్ని ఇప్పుడు ఎందుకు తెర మీదకు, తెచ్చింది? ఇదేమీ వెయ్యి డాలర్ల ప్రశ్న కాదు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఏ దిక్కు చూసినా అష్టమ దిక్కే కనిస్తోంది. ఓ వంక, ఉద్యోగులు,ఉపాధ్యాయులు రోడ్లెక్కేందుకు సిద్ధమయ్యారు. పీఆర్సీ విషయంలో అన్యాయం జరిగిందని ఆగ్రహంతో ఉన్నారు. సమ్మె నోటీసు ఇచ్చారు. అయినా, ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని, ఉద్యోగుల డిమాండ్స్ ఆమోదిస్తే, సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్పి, ఉద్యోగులను బూచిగా చూపించి ప్రజలను రెచ్చ గొట్టే ప్రయత్నం ప్రభుత్వం, అధికార పార్టీ చేశాయి. అయితే, తాతకు దగ్గులు నేర్పడం కుదిరే వ్యవహారం కాదని గుర్తు చేస్తూ ఉద్యోగులు, మాకసలు పీఆర్సీనే వద్దు,జీతం ఒక్క రూపాయి పెంచనూ వద్దు, పీఆర్సీ ఇస్తామంటున్న పది వేల కోట్ల రూపాయలను కూడా పేద ప్రజల సంక్షేమానికే ఖర్చు చేయండి, మాకు పాత జీతాలే ఇవ్వండి, అనే సరికి సర్కార్ పని కుడితిలో పడిన ఎలుకల మారింది. ఉద్యోగులను మోసం చేద్దామనుకుంటే అసలుకే మోసం వచ్చిందని అధికార పార్టీ అసంతృప్తులు అంటున్నారు.   మరో వంక గుడివాడ కాసినో వివాదం ముదిరి పాకన పడుతోంది. మంత్రి కొడాలి నానీ, పూటకో అడుగు పక్కకు వేస్తున్నారు. ప్రభుత్వం మెడకు గుదిబండగా మారుతున్నారు, అనే మాట వినవస్తోంది. కాసినో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. నానీ, గత ‘చరిత్ర; చిట్టా  మొత్తం బయటకు వస్తోంది. ఇంత కాలం అంతగా వినిపించని ఆయన భూకబ్జాలు,అవినీతికి   సంబందించిన అనేక ఆరోపణలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ఇవిగాక ఇంకా గా  నిగూడంగా ఉన్న చిక్కు ముళ్ళు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం కొత్త జిల్లాల అంశాన్ని మరో మారు తెరమీదకు తెచ్చింది. అయితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గానీ, మరొకరు కానీ, ‘చీటింగ్ ఈజ్ ది సీక్రెట్ అఫ్ మై సక్సెస్’ అనుకుంటే అన్ని సందర్భాలో అది సాధ్యం కాదు. ఇప్పుడు, ఇది కూడా అంతే .. అంటున్నారు.
Publish Date: Jan 26, 2022 9:56AM

చలికాలంలో ఎందుకు వణుకుతాం ?

  ఈ మధ్య కలాం లో తీవ్రమైన చలి పెరిగిపోయింది. దీనికారణంగా మనం భరించరాని చలిలో ఉన్నప్పుడు మన శరీరం వణుకు తుంది. దంతాలు కటకటా కొట్టుకుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది.  *శరీరం వణకడం దంతాలు కొట్టుకోవటమూ మనశరీరం లో వేడి ఉత్పత్తి కావటానికి జరిగే చర్యలు. బయటి నుంచి వచ్చే చలిని తట్టుకోవడానికి వీలుగా శరీరంలో ఉష్టం ఉత్పత్తి కావాలి. మన దవడ కండరాలు శరీరంలోని మిగతా కండరాలు వణకడం ద్వారా ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తాయి. అలా పుట్టిన ఉష్ణం బయటి చలిని తట్టుకోడానికి ఉపకరిస్తుంది.  *మరీ చల్లటి నీళ్ళలో స్నానం చేస్తున్నప్పుడు కూడా మన కండరాలు ఇలాగే వణుకు తాయి గమనించండి.  *ఇదే విధంగా మలేరియా మూత్రనాళఇన్ఫెక్షన్ కి సంబందించిన జ్వరం లాంటి కొన్ని జ్వరాలాలో కూడా మన శరీరపు టెంప రేచర్ బాగా పెరిగిపోతూ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది.  *ఇక్కడ కారణం కూడా ఇదే.  *మన శరీరంలో వృద్ధి చెందుతున్న రోగ క్రిముల వ్యాప్తిని అరి కట్టడానికి శరీరానికి ఉష్ణం బాగా కావాల్సి ఉంటుంది. వనకటం ద్వారా మనం ఈ ఉష్ణాన్ని సంపాదించు కుంటాము.  
Publish Date: Jan 26, 2022 9:30AM

పనికిమాలిన విషయాలు

అనగనగా ఓ బద్ధకిష్టి. బారెడు పొద్దెక్కాక లేవడం, తినడం, తిరగడం, రాత్రివేళకి పడుకోవడం.... ఇదే అతని దినచర్యగా ఉండేది. ఎప్పటిలాగే ఓ రోజు ఆ బద్ధకిష్టి సుష్టుగా తినేసి, అలా చల్లగాలికని చెరువుగట్టుకి చేరుకున్నాడు. ఆ చెరువుగట్టు మీద ఊసుపోక అటూఇటూ తిరగడం మొదలుపెట్టాడు. ఇంతలో అతనికి ఓ కపాలం కనిపించింది. దానిని చూసిన బద్ధకిష్టికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. దాని పక్కనే కూర్చుని నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టాడు. ఆ కపాలం తనని చూసి నవ్వినట్లు తోచింది. ‘ఎవరు నువ్వు? నీకు ఈ గతి ఎలా పట్టింది?’ అని అడిగాడు బద్ధకిష్టి.   ‘జీవితాన్ని వృధా చేసుకుంటూ, పనికిమాలిన విషయాలను పట్టించుకోవడం వల్లే ఈ స్థితికి చేరుకున్నాను,’ అంది ఆ కపాలం. ఆ మాటలు విన్న బద్ధకిష్టికి ఎక్కడలేని ఆశ్చర్యం వేసింది. కపాలం మాట్లాడటం ఏమిటి? అందులోనూ తన పరిస్థితికి కారణం ఏమిటో చెప్పడం ఏమిటి? అనుకున్నాడు. వెంటనే ఈ విషయాన్ని ఎవరితోనన్నా పంచుకోవాలని అనిపించింది. కానీ ఎవరితో పంచుకుంటే బాగుంటుంది! అని తెగ ఆలోచించాడు. చివరికి ఏకంగా రాజుగారి దగ్గరకు వెళ్లే తను చూసిన విషయాన్ని చెప్పాలని నిశ్చయించుకున్నాడు. ఇంత చిత్రమైన విషయం అంతటి ప్రభువు దగ్గరకు చేరాల్సిందే అని బయల్దేరాడు.   అలా బద్ధకిష్టి రాజుగారి దగ్గరకు బయల్దేరాడు. ఓ రెండు రోజులు కాలినడకన రాజధానికి చేరుకుని, రాజదర్బారులోకి ప్రవేశించాడు. అక్కడ నిండు సభలో ఉన్న రాజుగారిని చూస్తూ తను మోసుకొచ్చిన వార్తని వినిపించాడు. ‘కపాలం ఏమిటి? మాట్లాడటం ఏమిటి? నీకుగానీ మతిపోయిందా!’ అని అడిగారు రాజుగారు. ‘లేదు ప్రభూ! కావాలంటే మీరే వచ్చి స్వయంగా చూడండి!’ అంటూ రెట్టించాడు బద్ధకిష్టి. బద్ధకిష్టి అంత గట్టిగా చెప్పడంతో రాజుగారిలో కూడా ఎక్కడలేని ఆసక్తి బయల్దేరింది. ఎక్కడో కథల్లో తప్ప తను కపాలం మాట్లాడటం గురించి విననే లేదయ్యే! అందుకే మందీమార్బలాన్ని వెంటతీసుకుని బద్ధకిష్టి వెంట బయల్దేరాడు. ఓ పూటంతా ప్రయాణించి వారు కపాలం ఉన్న చెరువుగట్టుకి చేరుకున్నారు.   ఆ కపాలం ఇంకా అక్కడే ఉంది. చిరునవ్వు నవ్వుతున్నట్లే ఉంది. ‘నేను ఈ దేశపు రాజుగారిని తీసుకువచ్చాను. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో ఈయనతో ఓసారి చెప్పు,’ అని అడిగాడు బద్ధకిష్టి. దానికి ఆ కపాలం నుంచి ఎలాంటి జవాబూ రాలేదు. మరోసారి, ఇంకోసారి.... అలా పదేపదే ఆ కపాలాన్ని ప్రశ్నించినా కూడా అది నిమ్మకుండిపోయింది. కపాలం మాట్లాడకపోయేసరికి, రాజుగారికి పట్టరాని ఆవేశం వచ్చింది. తమని నవ్వులపాలు చేయడానికే బద్ధకిష్టి ఈ పన్నాగం పన్నాడని ఆయన అనుకున్నారు. వెంటనే ‘వీడి శిరస్సుని ఖండించి ఆ కపాలం పక్కనే పడేయండి,’ అని ఆజ్ఞాపించి తన దారిన తాను చక్కా వెళ్లిపోయారు.   రాజుగారి ఆజ్ఞని భటులు నెరవేర్చారు. ఆ కపాలం పక్కనే బద్ధకిష్టి శిరస్సుని కూడా పడేసి వెళ్లిపోయారు. అంతా సద్దుమణిగిన తరువాత, అప్పుడు మాట్లాడింది కపాలం. ‘నా సంగతి సరే! ఇప్పుడు నీ సంగతి చెప్పు. నీకు ఈ గతి ఎలా పట్టింది?’ అంటూ బద్ధకిష్టి శిరస్సుని అడిగింది. దానికి బద్ధకిష్టి శిరస్సు ‘ఏముంది! జీవితాన్ని వృధా చేసుకుంటూ, పనికిమాలిన విషయాలను పట్టించుకోవడం వల్లే ఈ స్థితికి చేరుకున్నాను,’ అంటూ నిట్టూర్చింది.   (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  
Publish Date: Jan 26, 2022 9:30AM

'ప‌ద్మ‌శ్రీ' మొగుల‌య్య చ‌రిత్ర ఇదే.. 'భీమ్లా నాయ‌క్‌'తో మారిన జీవితం..

ద‌ర్శ‌నం మొగుల‌య్య. ఇక నుంచి ప‌ద్మ‌శ్రీ మొగుల‌య్య‌. ఈ కిన్నెర క‌ళాకారుడికి దేశ అత్యున్న‌త పుర‌ష్కారాల్లో ఒక్క‌టైన ప‌ద్మ‌శ్రీ వ‌రించ‌డం తెలుగువారంద‌రికీ, జాన‌ప‌ద క‌ళాకారులంద‌రికీ గర్వ‌కార‌ణం. 12 మెట్ల కిన్నెర‌ను త‌న జీవిత‌మంతా వాయిస్తూ వ‌స్తున్నా.. 52 దేశాల ప్ర‌తినిధుల ముందు ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను ఇచ్చినా రాని గుర్తింపు.. ఒకే ఒక్క పాట‌తో వ‌చ్చింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ మూవీ భీమ్లా నాయ‌క్‌లో టైటింగ్ సాంగ్‌ను త‌న‌దైన స్టైట్‌లో పాడి.. ఓవ‌ర్‌నైట్ అంత‌కుముందు వ‌ర‌కూ రాని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. "సెభాష్‌.. ఆడాగాదు.. ఈడాగాదు.. అమీరోళ్ల మేడాగాదు.. గుర్రం నీళ్లా గుట్టా కాదు.. బెమ్మాజెముడు చెట్టున్నాది" అంటూ సెన్షేష‌న‌ల్ సాంగ్ పాడి అంద‌రికీ సుప‌రిచితులుగా మారారు మొగుల‌య్య‌. ఆ మొగుల‌య్య‌కు ఇప్పుడు భారత ప్ర‌భుత్వం ప‌ద్మ‌శ్రీ పురష్కారం అందించి ఆయ‌న్ను మ‌రింత గౌర‌వించ‌డం విశేషం. మొగులయ్య నాగర్‌కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకుల గ్రామంలో జన్మించారు. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీ మురికివాడలో కుటుంబంతో కలిసి జీవ‌నం సాగిస్తున్నారు. ప్ర‌స్తుతం మొగుల‌య్య వ‌య‌సు 68 ఏళ్లు. 500 ఏళ్ల చ‌రిత్ర ఉన్న 12 మెట్ల కిన్నెర వాయిద్యం వాయిస్తూ తెలంగాణ వీరగాథలు తన వాద్యంతో వినసొంపైన హావభావ సహితంగా వినిపిస్తాడు. వెదురు, గుండ్రటి సొరకాయలు, తేనె, మైనం, తీగలు, ఎద్దుకొమ్ములు, అద్దాలతో ఈ కిన్నెర వాద్యాన్ని తయారు చేస్తాడు. ఈ కళపై ఓ ఔత్సాహికుడు పీహెచ్‌డీ చేసి ప్ర‌పంచానికి ప‌రిచయం చేశాడు. మొగులయ్య జీవిత చరిత్ర ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా ఉంది.  అత్యంత పేద క‌ళాకారుడు ద‌ర్శ‌నం మొగుల‌య్య‌. క‌డుపునిండా తిండిలేక‌ మొగులయ్య భార్య శంకరమ్మ అనారోగ్యంతో మంచాన పడితే.. ఆసుపత్రిలో వైద్యం చేయించేందుకు వెయ్యి రూపాయ‌లు లేక పరిస్థితి విషమించి ఆమె చ‌నిపోయింది. 'కిన్నెర కన్నీరు' పేరుతో వచ్చిన కథనాన్ని పత్రికలో చూసి చలించిపోయిన సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళీ మొగులయ్యకు 25 వేల ఆర్థికసాయం అందించాడు.  తెలంగాణ రాష్ట్రం వ‌చ్చాక‌.. కేసీఆర్ ప్రభుత్వం దర్శనం మొగులయ్యకు ప‌లు విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది. ప్రతి నెల రూ.10 వేలు పింఛను అందజేస్తుంది. పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయ‌న‌తో ప్రదర్శలు ఇప్పిస్తోంది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దర్శనం మొగులయ్య కిన్నెర కళాకారుని ప్రతిభను గుర్తించి, ఆ కళారూపాన్ని డాక్యూమెంటరీ చేశారు. ఇక‌, భీమ్లా నాయ‌క్ మొగుల‌య్య జీవిత‌మే మారిపోయింది. కేవ‌లం సినిమా అవ‌కాశ‌మే కాదు, వ్య‌క్తిగ‌తంగా 2 ల‌క్ష‌ల న‌గ‌దు కూడా ఇచ్చారు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. తెలుగువారంద‌రూ గుర్తుప‌ట్టేలా పాపులారిటీ తెచ్చిపెట్టారు. ఇప్పుడు ఏకంగా ప‌ద్మ‌శ్రీ అవార్డు వ‌చ్చేందుకు ప‌రోక్షంగా కార‌ణ‌మ‌య్యారు జ‌న‌సేనాని.   
Publish Date: Jan 25, 2022 9:27PM