2లక్షల కేసులు.. వెయ్యి మరణాలు..

10 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యాయి. ఒక్క రోజులో 2లక్షలకు పైగా కొవిడ్ పాజిటివ్ కేసులతో రికార్డులు బద్దలయ్యాయి. మృతుల సంఖ్య వెయ్యి దాటేసింది. ప్రస్తుతం దేశంలో 14 లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇదంతా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించిన వివరాలు మాత్రమే. అనధికారికంగా ఈ సంఖ్య అంతకు మించే ఉంటుందంటున్నారు.  కరోనా ఉగ్రరూపం ఇది. వైరస్ మోగిస్తున్న మరణమృదంగం అది. భారీగా ప్రాణనష్టం. లక్షల్లో కల్లోలం. గడిచిన 24 గంటల్లో 2,00,739 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,038 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,40,74,564 కి చేరింది. 1,73,123 మంది మరణించారు. రోజువారి కేసుల సంఖ్య దాదాపు 10 రోజుల్లో రెట్టింపు అయ్యాయి.  దేశంలో ప్రస్తుతం 14,71,877 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు పది శాతానికి చేరువై కలవరపెడుతోంది. బుధవారం ఒక్కరోజే 93,528 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య కోటీ 24 లక్షలను దాటేసింది. ఫిబ్రవరిలో 97 శాతానికి పెరిగిన రికవరీ రేటు..ఇప్పుడు 88.92 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.  మహారాష్ట్ర కరోనా కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతోంది. రోజుకు 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అంటే, దేశంలో నమోదవుతున్న కేసుల్లో నాలుగోవంతు మహారాష్ట్ర నుంచే ఉంటున్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, ఢిల్లీని సైతం కొవిడ్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గుట్టలుగా శవాలు పేరుకుపోతున్నాయి. శ్మశానవాటికల్లో స్థలం ఖాళీలేదని వార్తలు వస్తున్నాయి.  జనాభాలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ సైతం కరోనా కబ్జాలో కూరుకుపోతోంది. మహారాష్ట్ర తర్వాత యూపీలోనే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. పుణ్యక్షేత్రాలు ఎక్కువగా ఉండటం, పండగల సీజన్ కావడంతో కొవిడ్ కు రాచమార్గం ఏర్పడింది. గడిచిన 24 గంటల్లో యూపీలో 20,439 కొత్త కేసులు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీని సైతం కరోనా గడగడలాడిస్తోంది. ఢిల్లీలో ఒక్కరోజులో 17,282 మందికి కరోనా సోకింది.   ఇక, ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే లక్షకు పైగా కొత్త కేసులు నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్ మాత్రమే ఉన్నాయి. గతంలో అమెరికాలో ఒకే రోజు అత్యధికంగా 3 లక్షలకుపైగా రోజూవారీ కేసులు నమోదవగా.. తాజాగా భారత్‌లో ఒకే రోజు అత్యధికంగా నమోదైన కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది.  ఒకవైపు కొవిడ్ కేసులు పెరుగుతుంటే, మరోవైపు వ్యాక్సినేషన్ సైతం అంతే జోరుగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా మూడు దశల్లో నడుస్తోన్న టీకా కార్యక్రమం కింద బుధవారం 33,13,848 మందికి వ్యాక్సిన్లు వేశారు. దీంతో, ఇప్పటి వరకు మొత్తం 11,44,93,238 టీకా డోసుల పంపిణీ పూర్తైంది.
Publish Date:Apr 15, 2021

ఏపీపై మరోసారి కేసీఆర్ సెటైర్లు! పాలకుడు వీకైతే అంతే.. 

ఇంటికి పెద్ద బలహీనంగా ఉంటే ఆ కుటుంబం అందరికి లోకువే.. రాష్ట్రానికి పాలకుడు వీక్ గా ఉంటే పక్క రాష్ట్రాలకు అలుసే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అచ్చం అలాగే ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏపీని పట్టించుకోవడం మానేసింది. పాలకుడు అడిగే పరిస్థితిలో లేదు కాబట్టే వరుసగా అన్యాయాలు చేసుకుంటూనే పోతోందనే చర్చ జరుగుతోంది. ఇది చాలదన్నట్లు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఏపీని అవహేళన చేసే పరిస్థితులు నెలకొన్నాయి.  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి ఆంధ్రప్రదేశ్ పై సెటైర్లు వేశారు. ఇటీవలే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏపీలో అంతా రివర్స్ అయిందని కామెంట్ చేశారు కేసీఆర్. గతంలో ఏపీలో ఒకరం భూమి అమ్మి తెలంగాణలో రెండు ఎకరాలు కొనేవారని... కాని ప్రస్తుతం తెలంగాణలో ఎకరం ల్యాండ్ అమ్మితే ఏపీలో రెండు ఎకరాల భూమి వస్తుందన్నారు. ఏపీలో అంతా రివర్స్ గా ఉందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపాయి. అంధ్రా ప్రజలకు ఇబ్బందిగా మారింది.  తాజాగా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచార సభలో మరోసారి ఆంధ్రప్రదేశ్ ను టార్గెట్ చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. గోదావ‌రిపై కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్టి.. రైతుల పాదాల‌ను క‌డుగుతున్నామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. నాగార్జున సాగ‌ర్ ఆయ‌క‌ట్టు కింద అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామ‌న్నారు. ఇండియాలో ఈ యాసంగిలో 52 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రి సాగు చేసింది తెలంగాణ‌ అన్నారు. తెలంగాణను హేళన చేసిన.. ఆంధ్రా 29 ల‌క్ష‌ల‌తో మూడో స్థానానికి పడిపోయిందని హేళనగా మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.  తెలంగాణ ధ‌నిక రాష్ట్రమైందని.. ఇతర రాష్ట్రాలు మాత్రం అప్పుల్లో మునిగిపోయాయని చెప్పారు.   కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ ప్రజల్లో చర్చ జరుగుతోంది. జగన్ తనను ప్రశ్నించలేరనే భావనతోనే కేసీఆర్.. ప్రతిసారి ఏపీని టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. ఏపీలో పాలన సరిగా లేదనే అర్ధం వచ్చేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని అంటున్నారు. ఇది ముందుముందు ఏపీకి నష్టం కల్గిస్తుందని, వ్యాపార వేత్తలు ఏపీకి రాకుండా పోయే పరిస్థితి ఉందనే ఆందోళనలో కొందరి నుంచి వ్యక్తమవుతోంది. మొదటి సారి మాట్లాడినప్పుడే కేసీఆర్ కు ఏపీ పాలకులు కౌంటర్ ఇస్తే .. మళ్లీ మళ్లీ ఇలా మాట్లాడే అవకాశం లేకుండా పోయిదనే చెబుతున్నారు.    
Publish Date:Apr 14, 2021

మాస్క్ లేకుంటే మటాషే.. గాలి ద్వారా కరోనా వ్యాప్తి! 

దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి సంబంధించి మరో షాకింగ్ న్యూస్. ఇది జనాలను మరింత కలవరపరిచే వార్తే. కరోనా మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండకపోతే తెలంగాణకు మహారాష్ట్ర పరిస్థితి వస్తుందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పడకల కొరత ఏర్పడుతుందన్నారు డా.శ్రీనివాస్‌. రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల్లో కరోనా రోగులకు పడకల కొరత ఏర్పడిందన్నారు.  గతంతో పోల్చితే ప్రస్తుత వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని చెప్పారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్. ఇంట్లో ఒకరికి వైరస్‌ సోకితే గంటల్లోనే మిగతా వారికి వ్యాపిస్తుందని వెల్లడించారు. ఇప్పటివరకు బయట మాత్రమే మాస్క్‌ వేసుకోమని చెప్పామని..ఇకపై ఇంట్లో ఉన్నా మాస్క్‌ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని.. మరో 4 నుంచి 6 వారాల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. ప్రజల జీవనోపాధి దెబ్బతినకూడదనే లాక్‌డౌన్ పెట్టడం లేదన్నారు. ప్రజలు స్వీయనియంత్రణ పాటించకపోతే పరిస్థితి విషమిస్తుందని  డా.శ్రీనివాస్‌ హెచ్చరించారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా కేసులు మళ్లీ పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఫస్ట్ వేవ్ సమయంలో 20 శాతం మంది పేషెంట్లు ఆసుపత్రుల్లో చేరారని... సెకండ్ వేవ్ లో 95 శాతం మంది ఇంటి వద్దే ఉంటూ చికిత్స పొందుతున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 47 వేల పడకల్లో సగానికి పైగా కోవిడ్ పేషెంట్లకే వాడుతున్నామని తెలిపారు. సీరియస్ కేసులు వస్తే... ప్రైవేట్ ఆసుపత్రులు గాంధీ ఆసుపత్రికి పంపుతున్నాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ధర్నాలు చేయవద్దని కోరారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
Publish Date:Apr 14, 2021

భగత్ గాలి బాగానే ఉంది..

నాగార్జునసాగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి జానారెడ్డి చేసింది ఏమీ లేదన్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 30 ఏళ్ల అనుభవమున్న జానారెడ్డి.. హాలియాకు డిగ్రీ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారని తప్పుబట్టారు. నాగార్జున సాగర్‌కు త్వరలోనే డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తామన్నారు సీఎం కేసీఆర్.  సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియా పరిధిలోని అనుములలో నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్‌ మాట్లాడారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని.. పరిణతితో ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. ఓటు వేసే ముందు న్యాయం ఎవరివైపు ఉందో ఆలోచించాలన్నారు. నాగార్జున సాగర్‌లో సంక్షేమ పథకాలు అందడంలేదా..? పైరవీలు లేకుండా పాలన సాగిస్తున్నాం.’’అని కేసీఆర్ అన్నారు.  నోముల భగత్‌కు ఏవిధంగా ఓట్లు పడతాయో అదే విధంగా నెల్లికల్లు లిఫ్ట్ నీళ్లు కూడా దూకుతాయని కేసీఆర్ హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో భగత్‌ గాలి బాగానే ఉందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. మిత్రుడు నోముల నర్సింహయ్యను కోల్పోవడం బాధాకరమని చెప్పారు. వామపక్ష పార్టీల్లో ఉంటూ ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆయన తనయుడు, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను ఆశీర్వదించాలని కోరారు. 
Publish Date:Apr 14, 2021

రంజాన్ ప్రార్థనలకు హైకోర్టు నో

రంజాన్ సామూహిక ప్రార్థనలకు అనుమతించాలని కోరుతూ ఓ మసీదు ట్రస్టు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కొవిడ్-19 ఉధృతి తీవ్ర స్థాయిలో ఉన్నందున సామూహిక ప్రార్థనలకు అనుమతించడం కుదరదని తేల్చి చెప్పింది. మత విశ్వాసాన్ని అనుసరించే హక్కు ముఖ్యమే అయినా.. పౌరుల సంక్షేమం అంతకంటే ముఖ్యమని ధర్మాసనం స్పష్టం చేసింది.  రంజాన్ మాసం దృష్ట్యా తమ మసీదులో రోజుకు ఐదు సార్లు ప్రార్థనలు చేసుకునేందుకు ముస్లింలకు అనుమతి ఇవ్వాలంటూ దక్షిణ ముంబైలోని జుమా మసీదు ట్రస్ట్ బోంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం.. ‘‘ మత విశ్వాసాలు అనుసరిస్తూ, వేడుకలను జరుపుకునే హక్కు ముఖ్యమైనదే అయినప్పటికీ.. ప్రజా భద్రత, పౌరుల సంక్షేమం అంతకంటే ముఖ్యమైన, సర్వోన్నతమైనదని గమనించాలి.’’ అని కోర్టు అభిప్రాయపడింది. తమ మసీదు ఎకరం స్థలంలో విస్తరించి ఉందనీ.. ఒకేసారి 7 వేల మంది సమావేశమయ్యేందుకు సరిపోతుందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఒక్కో విడతకు కనీసం 50 మందినైనా రంజాన్ సమయంలో ప్రార్థనలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ట్రస్ట్ కోరింది. కొవిడ్-19కి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కూడా కోర్టుకు విన్నవించింది. అయితే పిటిషనర్ వాదనను అదనపు ప్రభుత్వ ప్లీడర్ జ్యోతి చవాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. మహారాష్ట్రలో ప్రత్యేకించి ముంబైలో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని ఆమె కోర్టుకు నివేదించారు. ‘‘ఏ మతానికి మేము మినహాయింపు ఇవ్వలేము. ప్రత్యేకించి ఈ 15 రోజుల్లో అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఈ దశలో మేము ఎలాంటి రిస్క్ తీసుకోలేం. ప్రజలంతా సహకరించాలి.’’ అని చవాన్ అన్నారు.  ప్రజలు తమ విశ్వాసాలను కొనసాగించడంపై ప్రభుత్వం ఎలాంటి నిషేధం విధించలేదని.. అయితే వాటిని ప్రజలు తమ ఇళ్ల దగ్గరనే చేసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ న్యాయవాది వాదనతో ఏకీభవించిన ధర్మాసనం... ప్రస్తుతం కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నందున పిటిషనర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేమంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. కొవిడ్-19 సంక్షోభం కారణంగా గతంలో కూడా దేశంలోని అనేక కోర్టులు మతాలకు అతీతంగా సామూహిక ప్రార్థనలకు అనుమతి నిరాకరించిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది.
Publish Date:Apr 14, 2021