రెండు నెలల బాలుడి ప్రాణం తీసిన అత్త మామ.. 

మనుషులు మరి క్రూరంగా తయారు అవుతున్నారు. రకరకాల కారణాలు చెప్పుకుని ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడం లేదు. ఇంట్లో పెద్దవాళ్ళ మధ్య గొడవలు. కారణాలు ఏంటో తెలియలేదు.. ఆ గొడవలు ఎందుకు జరిగాయో తెలీదు. కసాయిగా మారుతున్నారు. ఇడ్లీ వేసినంత ఈజీగా మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. పెద్దల మధ్య గొడవలు పసివాడి ప్రాణం తీసింది.. ఎందుకు అని తెలుసుకోవాలనుకుంటున్నారా.. మీరే తెలుసుకోండి.. తెలుస్తుంది.  అది రంగారెడ్డి జిల్లా.  అబ్దుల్లాపూర్‌మెట్ మండలం. అనాజ్‌పూర్‌ గ్రామం. ఆ గ్రామానికి చెందిన రంగయ్య కుమార్తె బాలమణి రెండు నెలల క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో రోజు లాగే గురువారం రాత్రి బాలుడితో పాటు కుటుంబ సభ్యులంతా ఇంట్లో నిద్రించారు. ఉదయం ఉదయం నిద్ర లేచి చూసే సరికి.. బాలుడు కనిపించలేదు.. ఇల్లు అంతా వెతికారు.. ఏమైపోయాడు అని కంగారు పడ్డారు. చివరికి ఆ బాలుడు ఇంటిపైన  ఉన్న నీటి ట్యాంకులో చావమై తేలాడు.  వివ‌రాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన తెల్లవారుజాము నుంచి బాలుడు కనిపించట్లేదని గాలించిన తల్లిదండ్రులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనాజ్‌పూర్‌లో సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా పోలీసులుకు ఎలాంటి ఆచూకి ల‌భించలేదు. దీంతో బాలుడి ఇంటిని పోలీసులు అణువణువునా గాలించారు.  చివరకు ఇంటిపైన వెతకగా నీటి ట్యాంకులో బాలుడి మృతదేహం కనిపించింది.  బాలుడి మృత దేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మేనమామ, అత్తే హత్య చేసుంటారన్న అనుమానంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలే చిన్నారి హత్యకు కారణమని భావిస్తున్నారు. పసికందును హత్య చేసి ట్యాంకులో పడేశారని తెలిపారు. ఘటనాస్థలిని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి పరిశీలించారు.  ప్రస్తుతం ఈ ఘటన స్ధానికంగా కలకలం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
Publish Date:Jun 18, 2021

ర‌ఘురామ ఫిర్యాదుపై స్పీక‌ర్ యాక్ష‌న్‌.. రంగంలోకి కేంద్ర హోంశాఖ‌.. జ‌గ‌న్‌రెడ్డీ గెట్ రెడీ!

పావులు క‌దులుతున్నాయ్‌.. పాపం పండుతోంది.. సీఎం జ‌గ‌న్‌రెడ్డికి వ్య‌తిరేకంగా ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయ్‌.. త‌న‌ను క‌స్ట‌డీలో తీవ్రంగా కొట్టారంటూ ఎంపీ ర‌ఘురామ లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై యాక్ష‌న్ మొద‌లైపోయింది. బంతి కేంద్ర హోంశాఖ ముందుకు వ‌చ్చింది. ఇక‌, ఏపీ స‌ర్కారుకు ముందుముందు క్రొక‌డైల్ ఫెస్టివ‌లే అంటున్నారు.  నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇచ్చిన సభాహక్కుల నోటీసుపై లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయం స్పందించింది. మే 14న తనని అరెస్ట్‌ చేయడం, ఆ తర్వాత తీవ్రంగా హింసించడంపై స్పీకర్‌ ఓం బిర్లాకు రఘురామ జూన్ 2న‌ ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం జ‌గ‌న్‌, డీజీపీ, సీఐడీ ఏడీజీ, గుంటూరు అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్‌‌పై ఎంపీ రఘురామ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.  రఘురామకృష్ణం రాజును కస్టోడియల్ టార్చర్‌కు గురి చేయడంపై ఆయన కుమారుడు భరత్‌, టీడీపీ ఎంపీలు కనమేడల రవీంద్రకుమార్‌, రామ్మోహన్‌నాయుడు కూడా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అన్ని ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్‌ కార్యాలయం.. వెంటనే సమగ్ర వివరాలు అందజేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లాను ఆదేశించింది. 15 రోజుల్లో సమగ్ర నివేదిక‌ను పంపాలని లోక్‌స‌భ సెక్ర‌టేరియ‌ట్‌ నోటీసులు పంపింది.    ఎంపీ ర‌ఘురామ ఫిర్యాదుపై లోక్‌స‌భ స్పీక‌ర్ కార్యాల‌యం స్పందించ‌డంతో వివాదం పార్ల‌మెంట్ సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. వెంట‌నే పూర్తి వివ‌రాలు అంద‌జేయాలంటూ కేంద్ర హోంశాఖను ఆదేశించ‌డం కీల‌క ప‌రిణామం. సీఐడీ కేసు ఏపీ స‌ర్కారు డైరెక్ష‌న్‌లోనే జ‌రుగుతోంద‌ని.. కుట్ర‌లో భాగంగానే ర‌ఘురామ‌ను టార్చ‌ర్ చేశార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇదే సమ‌యంలో బెయిల్‌పై ఉన్న ర‌ఘురామ‌పై ప‌రారీలో ఉన్న‌ట్టుగా కేసులోని లూప్‌పోల్స్ వాడుకొని.. మ‌రోసారి అరెస్ట్ చేసేందుకు ఏపీ స‌ర్కారు సిద్ధ‌మ‌వుతోందనే అనుమాన‌మూ వ్య‌క్త‌మ‌వుతోంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో.. ర‌ఘురామ ఎపిసోడ్‌లో స‌మ‌గ్ర వివ‌రాలు ఇవ్వాలంటూ స్పీక‌ర్ కార్యాల‌యం కేంద్ర హోంశాఖ‌ను అదేశించ‌డం ఆస‌క్తిక‌రం.  ఇప్పుడిక కేసుపై కేంద్ర హోంశాఖ దృష్టి పెడుతుంది. కేసులు, కుట్ర‌లు, క‌స్ట‌డీలో కొట్ట‌డాలు.. ఇలా అన్ని విష‌యాల‌పైనా వివ‌రాలు ఆరా తీస్తుంది. అప్పుడిక అవుటాఫ్ ఇంట్రెస్ట్‌ వెళ్లే ప‌రిస్థితి ఉండ‌దు. కేంద్ర హోంశాఖ‌ను ఏపీ పెద్ద‌లు ప్ర‌భావితం చేయ‌లేదు. నిజాలు నిక్క‌చ్చిగా బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశ‌మూ ఉంటుంది. ఒక‌వేళ‌ క‌స్ట‌డీలో ర‌ఘురామ‌ను కొట్టార‌నే విష‌యం నిజ‌మ‌ని తేలితే.. విష‌యం పార్ల‌మెంట్ దృష్టికి వెళుతుంది. ఓ ఎంపీపై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగం రుజువైతే.. పార్ల‌మెంట్‌లో సీఎం ప్ర‌భుత్వం దోషిగా నిల‌బ‌డాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా, రాష్ట్రాలు, పార్టీల‌కు అతీతంగా ర‌ఘురామ‌కు మ‌ద్ద‌తు పెరుగుతోంది. ఓ ఎంపీపై జ‌రిగిన దాడిని పార్ల‌మెంట్‌పైన జ‌రిగిన దాడిగానే ప‌రిగ‌ణిస్తామ‌ని ఇప్ప‌టికే ప‌లువురు ఎంపీలు బ‌హిరంగంగానే స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. ఈ అంశం త‌ప్ప‌క పార్ల‌మెంట్‌లో లేవ‌నెత్తుతామ‌ని ప్ర‌క‌టించారు. ఆ భ‌యంతోనే ర‌ఘురామ‌పై వేటు వేయాలంటూ వైసీపీ లోక్‌స‌భ‌ స్పీక‌ర్‌కు మ‌రోసారి ఫిర్యాదు కూడా చేసింది.  ఏది ఏమైనా జూలైలో జ‌రిగే పార్ల‌మెంట్ సెష‌న్‌లోనే ర‌ఘురామ అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఆ లోగా స్పీక‌ర్ కార్యాల‌యం ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర వివ‌రాల‌ను కేంద్రం హోంశాఖ ద్వారా తెప్పించుకుంటోంది. అంటే, ర‌ఘురామ ఎపిసోడ్‌పై పార్ల‌మెంట్ సీరియ‌స్‌గా దృష్టి సారించిన‌ట్టేగా? స్పీక‌ర్ కార్యాల‌య‌మే స్పందించిందంటే మేట‌ర్ మంట పుట్టించేదేగా? అదే జ‌రిగితే.. పార్ల‌మెంట్‌లో సీఎం జ‌గ‌న్‌రెడ్డికి ద‌బిడి దిబిడే... ర‌ఘురామతో పెట్టుకుంటే అంతే...  
Publish Date:Jun 18, 2021

ప్రత్యేక హోదాపై జగన్ హ్యాండ్సప్! తాకట్టు పెట్టేసినట్టేనా..? 

ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు సంజీవని. స్పెషల్ స్టేటస్ ఏపీ హక్కు అని, విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదాతోనే న్యాయం జరుగుతుందనేది ప్రజల భావన. విభజన చట్టంలోనూ దీన్ని పొందు పరిచారు. పార్లమెంట్ లో అప్పటి దేశ ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. కాని విభజన జరిగి ఏడేండ్లు పూర్తైనా ప్రత్యేక హోదా హామీ మాత్రం నెరవేరలేదు. ఏపీతో కేంద్ర ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయనే ఆగ్రహం ఏపీ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. ప్రత్యేక హోదా కేంద్రంగానే రాజకీయం చేశారు. తమ పార్టీకి అధికారం ఇస్తే కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. కాని ఆయన అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తైనా ప్రత్యేక హోదాపై మాత్రం అతిగతీ లేదు.  ప్రత్యేక హోదా సాధించడం కాదు..  కనీసం ఆ పదం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పలకడం లేదనే విమర్శలు ఉన్నాయి. కేంద్రాన్ని నిలదీస్తానన్న జగన్... కేంద్రం ముందు హోదా ప్రస్తావన కూడా తేవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మడమ తిప్పేది లేదు.. మాట తప్పేది లేదు అని గొప్పగా చెప్పుకునే జగన్.. ప్రత్యేక హోదా విషయంలో మాత్రం మడమ తిప్పేశారని, కేంద్రానికి తాకట్టు పెట్టేశారనే విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల కోసం ప్రత్యేక హోదా గురించి కేంద్రంతో రాజీ పడ్డారని మండిపడుతున్నాయి. వైసీపీ నేతలు మాత్రం ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నామని చెబుతున్నారు. అయితే తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డే ప్రత్యేక  హోదాపై చేతులెత్తేశారు. కేంద్రం దగ్గర చేసేదిమి లేదంటూ.. ప్రత్యేక హోదా ఇక రాదనే సంకేతమిచ్చారు.  2021-22కు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నామని చెప్పారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో సంకీర్ణ సర్కార్ లేదని, కేంద్రం దగ్గర చేసేదేమి లేదని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేలేమంటూ.. తన వల్ల కాదని అంగీకరించారు జగన్. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడుతానని చెప్పిన జగన్... ఇప్పుడు ఏం చేయలేమంటూ హ్యాండ్సప్ అనడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  లోక్ సభలో వైసీపీకి 22 మంది ఎంపీలున్నారు. లోక్ సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉంది వైసీపీ. 22 మంది ఎంపీలున్నా కేంద్రంతో పోరాడలేమని సీఎం జగన్ చెప్పడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. అసలు కేంద్రాన్ని అడగకుండా ఎలా సాధిస్తారని ప్రశ్నిస్తున్నారు. 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరగదా అని కొందరు నిలదీస్తున్నారు. జగన్ వాలకం చూస్తుంటే ప్రత్యేక హోదా తమకు అక్కరలేదని కేంద్రానికి చెప్పినట్లుగా ఉందనే అభిప్రాయం కూడా కొన్ని  వర్గాల నుంచి వస్తోంది.  విపక్షాలు ఆరోపిస్తున్నట్లు తన కేసుల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టినట్లుగా ఉందని ఏపీ జనాలు అనుమానిస్తున్నారు. సంకీర్ణ సర్కార్ కాకున్నా కొన్ని రాష్ట్రాలు తమకు కావాల్సిన వాటిని సాధించుకుంటున్నాయని చెబుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను చూసైనా జగన్ నేర్చుకోవాలని సూచిస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు, కేసుల కోసం రాజీ పడి.. రాష్ట్రానికి జగన్ అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు.
Publish Date:Jun 18, 2021

ఏపీలో కర్ఫ్యూ మరింత సడలింపు.. ఆ జిల్లాలో పాత రూల్సే..

ఆంధ్రప్రదేశ్ లో  కర్ఫ్యూ వేళలను మరింత సడలించారు. పగలంతా కర్ఫ్యూ ఎత్తేశారు. కొవిడ్ పై సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఏపీలో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు సడలింపు ఉండగా.. ఇకపై ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సడలింపు ఇవ్వాలని కర్ఫ్యూ సీఎం జగన్ నిర్ణయించారు. జూన్‌ 20 నుంచి 30 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సాయంత్రం 5 గంటల కల్లా దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి కర్ఫ్యూ కచ్చితంగా అమలవుతుంది.  తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం పాత రూల్సే అమలు చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మాత్రమే సడలింపు వర్తించనుంది. కొవిడ్‌ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మాత్రమే సడలింపు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ రెగ్యులర్‌ టైమింగ్స్‌ ప్రకారం నడవనున్నాయి. ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు చేస్తున్నారు.  ఏపీలో కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గతంలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదవగా.. ప్రస్తుతం 6 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. 
Publish Date:Jun 18, 2021

బీ కేర్‌ఫుల్‌.. వ‌దిలిపెట్టం.. వేటాడ‌తాం.. లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్‌..

మేము సింహం లాంటి వాళ్లం.. అరాచ‌కాల‌కు భ‌య‌ప‌డి పారిపోయే వాళ్లం కాదు.. మిమ్మల్ని వదిలిపెట్టం.. వేటాడతాం.. మా ఓపిక‌ను ప‌రీక్షించొద్దు.. స‌మ‌యం వ‌స్తుందు.. నేనే గుణ‌పాఠం చెబుతా.. అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో 27 మంది టీడీపీ కార్యకర్తలను దారుణంగా చంపారని మండిప‌డ్డారు. టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై వరుస దాడులు జరుగుతున్నాయని.. ప్రజల ప‌క్షాన పోరాడుతున్న వారిపై దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు.  కర్నూలు జిల్లా పెసరవాయిలో హత్యకు గురైన టీడీపీ నేతలు నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి కుటుంబాలను నారా లోకేశ్‌ పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులను కోల్పోయామని..  బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని.. అన్ని రకాలుగా ఆ కుటుంబాలను ఆదుకుంటామ‌ని.. నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు.    ‘‘టీడీపీ కార్యకర్తలను బెదిరించి, నాయకులను చంపితే మేం వెనక్కి తగ్గుతామని అనుకుంటున్నారా? మిమ్మల్ని వదిలిపెట్టం. మా కార్యకర్తలను భయపెడితే పార్టీకి నష్టం తేవచ్చని మీరు అనుకుంటున్నారు. టీడీపీ ఎక్కడికీ పోదు. మేం మీకు భయపడి పారిపోయేవాళ్లం కాదు. ధైర్యంగా నిలబడి ప్రజల తరఫున పోరాడతాం. మా ఓపికను పరీక్షించొద్దు.. బీ కేర్‌ఫుల్‌. సమయం వస్తుంది.. అప్పుడు నేతలు, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న అధికారులకు గుణపాఠం చెప్పే బాధ్యతను నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని టీడీపీ కార్యకర్తలకు హామీ ఇస్తున్నా’’ అని లోకేశ్‌ అన్నారు.   మంచి పని చేయాలంటే అభివృద్ధి చేయండి. రాయలసీమకు కొత్త పరిశ్రమలు తీసుకురండి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయండి. అవి మీకు చేతకాకే మా కార్యకర్తలు, నేతలపై ఎదురుదాడి చేస్తున్నారని నారా లోకేశ్ మండిప‌డ్డారు.   క‌ర్నూలు జిల్లా పెస‌ర‌వాయికి చెందిన టీడీపీ నేత‌లు నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి గురువారం ఉదయం శ్మశానానికి వెళ్తుండ‌గా.. ప్ర‌త్య‌ర్థులు మాటు వేసి హ‌త‌మార్చారు. పక్కా ప్రణాళికతో కారుతో ఢీకొట్టి.. వేట కొడవళ్లు, గొడ్డళ్లతో నరికి వారిని దారుణంగా చంపేశారు. ఘ‌ట‌న‌లో మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాల‌య్యాయి. వైసీపీ నాయ‌కులే ఈ హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డార‌ని తెలుస్తోంది. ఆ రెండు వ‌ర్గాల‌కు ఎప్ప‌టినుంచో గొడ‌వ‌లు ఉన్న‌ట్టు స‌మాచారం.
Publish Date:Jun 18, 2021

11 నుంచి 26 శాతానికి పెరిగిన వ్యతిరేకత! అయినా మోడీనే ప్రపంచ టాప్ లీడర్.. 

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవా తగ్గిందా? కొంత కాలంగా ఆయన ఇమేజ్ తగ్గుతూ వస్తోందా? వచ్చే ఎన్నికల్లో ఆయనను తప్పించాలని కాషాయ దళం భావిస్తుందా? ఇదే చర్చ కొన్ని రోజులుగా దేశ రాజకీయాల్లో కీలకంగా మారింది. ప్రధాని మోడీపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలపై బీజేపీలో టెన్షన్ పెరుగుతుందని కూడా వార్తలు వచ్చాయి. నిజానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..  ప్రపంచంలోనే పాపులారిటీలో టాప్ లీడర్. గతంలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నిర్వహించిన సర్వేలో ఆయనకే మొదటి స్థానం దక్కింది. సోషల్ మీడియాలోనూ ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న లీడర్ గా మోడీనే నిలిచారు. ఈ విషయంలో అమెరికా ప్రెసిడెంట్ ను కూడా వెనక్కి నెట్టారు నరేంద్ర మోడీ. అయితే కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత.. భారత ప్రధాని క్రేజీ తగ్గిందనే వార్తలు వచ్చాయి. కరోనా కట్టడిలో మోడీ ప్రభుత్వం విఫలమైందంటూ అంతర్జాతీయ మీడియాలో భారీగా కథనాలు వచ్చాయి. దేశంలో మోడీపై గతంలో ఎప్పుడు లేనంత వ్యతిరేకత కనిపిస్తోంది.  నరేంద్ర మోడీ క్రేజీ తగ్గిందనే వార్తలతో కలవరపడుతున్న కమలనాధులకు ఊరటనిచ్చే న్యూస్ వచ్చింది. ప్రపంచంలో ఎక్కువ పాపులారిటీ  ఉన్న నేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీనే మరోసారి టాప్ ప్లేస్ లో నిలిచారు. పలు దేశాల అధినేతలకన్నా ముందు నిలిచారు. 'మార్నింగ్ కన్సల్ట్’ అనే సంస్థ చేసిన సర్వేలో 66 శాతం మంది ప్రధాని నరేంద్ర మోడీనే మళ్లీ దేశాధినేతగా కావాలని కోరుకుంటున్నారట. ‘గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్’ పేరిట ఆ సర్వే ఫలితాలను మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది. ఈ లిస్టులో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా 13 అగ్రదేశాధినేతల కన్నా ప్రధాని మోడీకే ఎక్కువ మంది జై కొట్టారు.  భారత్ లో 2,126 మందిని సర్వే చేస్తే అందులో 66 శాతం మంది.. ప్రధాని మోడీకి ఓటేశారు. మరో 28 శాతం మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే గతంతో పోలిస్తే మోడీ స్కోర్ పడిపోయింది. జమ్మూకశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి హోదా కల్పించే 370 అధికరణాన్ని రద్దు చేసిన ఆగస్టు 2019లోమోడీని దేశంలో  82 శాతం మంది ఆమోదించారని, కాని ఇప్పుడది 65 శాతంగానే ఉందని మార్నింగ్ కన్సల్ట్ సంస్థ వెల్లడించింది. 2019లో మోడీని కేవలం 11 శాతం మందే వ్యతిరేకించగా.. ప్రస్తుతం అది 26 శాతానికి పెరిగింది. ఇదే బీజేపీలో కొంత ఆందోళన రేపుతోంది.  65 శాతం మంది ఆమోదంతో మోడీ తర్వాతి స్థానంలో ఇటలీ ప్రధాని మారియో ద్రాఘీ ఉన్నారు. మూడో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రూస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ (63%) ఉన్నారు.  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానంలో నిలిచారు. ఆయనకు  53 శాతం మంది అమెరికన్లు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ (54%), జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ (53%), కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడూ (48%), బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (44%), దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ (37%), స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ (36%), బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో (35%), ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ (35%), జపాన్ ప్రధాని యోషిహిదే సూగా (29%) ఉన్నారు. వారం రోజుల సగటు ఆధారంగా ఈ సర్వే ఫలితాలను వెల్లడించినట్టు మార్నింగ్ కన్సల్ట్ పేర్కొంది. సర్వేను ఆన్ లైన్ లో చేసినట్టు తెలిపింది. 
Publish Date:Jun 18, 2021