మాజీ స్పీకర్ మండలి చైర్మన్?

రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో... ఎప్పుడు ఎవరిని ఏ పదవి ఎప్పుడు ఎలా వరిస్తుందో, కొన్ని కొన్ని సందర్భాలలో ఊహకు కూడా చిక్కదు. తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్’గా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించుకున్న, మధుసూదనాచారి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా భూపాలపల్లి నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడి పోయారు. అప్పటి నుంచి ఏ పదవీ లేక,  ఒక విధంగా విరహ వేదన అనుభవిస్తున్నారు. అయితే ఇప్పుడు అనుకోకుండా, ఆయన్ని ఎమ్మెల్సీ పదవి వరించింది. అది కూడా కొంచెం ఎక్కువ గౌరవప్రదమైన గవర్నర్ నామినేషన్ కోటాలో, ఆయన ఎమ్మెల్సీగా పెద్దల సభలో కాలు పెట్టారు.  నిజానికి ఈ గౌరవం, కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి దక్కవలసింది.  అయన పార్టీలో చేరిన 15 రోజులకే ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన్ని గవర్నర్ కోటాలో నామినేషన్’కు ఎంపిక చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రి వర్గం కూడా, కౌశిక్ రెడ్డ్డి  పేరును నామినేటెడ్ ఎమ్మెల్సీగా సిఫార్సు చేస్తూ తీర్మానం చేసింది. గవర్నర్’ కు కూడా పద్దతిగానే పంపించారు. అయితే, ముఖ్యమంత్రి ఒకటి తలిస్తే గవర్నర్ వేరోకటి తలిచారో ఏమో కానీ, ఎందుకనో నెలలు గడచినా గవర్నర్ ఆ ఫైల్ క్లియర్ చేయలేదు.  ఇంతలో పుణ్య కాలం కూడా ముగిసి పోయింది . హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసింది. తెరాస ఓడిపోయింది. అయినా, ముఖ్యమంత్రి కౌశిక రెడ్డిని మాత్రం బోడి మల్లయ్యను చేయలేదు. ఎమ్మెల్ల్యే కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆయన  ఏకగ్రీవంగా గెలిచారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అలా కౌశిక రెడ్డికి దక్కవలసిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి,  మధుసూదనాచారికి దక్కింది . ఆఫ్కోర్సే, అది కాకపోతే, ఎమ్మెల్సీ కోటాలో లేదా స్థానిక కోటలోనో  మధుసూదనాచారికి ఎమ్మెల్సీ పదవి దక్కితే దక్కేదేమో, కానీ, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కావడంతో ఆయనకు ఇంకొంచెం ఎక్కువ   గౌరవం దక్కిందని అనికోవచ్చును .  అదలా ఉంటే, తెలంగాణ తోలి అసెంబ్లీ స్పీకర్’గా చరిత్రలో స్థానం సంపాదించుకున్న మధుసూదనాచారి ఇప్పుడు, ఉభయ సభల అధ్యక్ష పదవిని అందుకున్న తొలి వ్యక్తిగా    మరో చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నారని సమాచారం. అసెంబ్లీ స్పీకర్’గా పనిచేసిన ఆయన్ని మండలి చైర్మన్’ గా నియమిచాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు సమాచారం. మండలి తొలి చైర్మన్  స్వామి గౌడ్ పదవీ కాలం ముగిసిన తర్వాత మండలి చైర్మెన్‌గా ఉన్న ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పదవి కాలం కూడా ముగిసింది. ప్రస్తుతం ప్రొటెం చైర్మెన్‌గా ఉన్న భూపాల్‌రెడ్డి పెద్దల సభను నడిపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ  స్థానంలో మధుసూదనాచారిని నియమించే అవకాశం ఉన్నట్టు పార్టీ  వర్గాల సమాచారం. గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా మళ్ళీ మండలికి ఎన్నికయ్యారు. అయితే, ఆయనకు  చైర్మన్ పదవి కంటే మంత్రి పదవి పై మక్కువని అంటారు. అందుకే ఆయన ‘ఒక్క అవకాశం’ కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి కూడా అందుకు సుముఖంగానే ఉన్నారని సమాచారం. సో..ఆయనకు మంత్రి పదివి ఎలా ఉన్నా మధుసూదనాచారికి మాత్రం చైర్మన్ పదవి ఖాయమని అంటున్నారు.  ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి చైర్మెన్‌గా చారిని నియమించడంతోపాటు అసెంబ్లీ మాజీ స్పీకర్‌కు తగిన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంలో సీఎం ఆ బాధ్యతలు ఆయనకు అప్పగిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతున్నది. ఎమ్మెల్యే కోటాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, పరుపాటి వెంకట్రా మిరెడ్డి నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం చైర్మెన్‌ భూపాల్‌రెడ్డి శాసనమం డలిలోని తన చాంబర్‌లో వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ నేపధ్యంలో మధుసూదనాచారి కాబోయే చైర్మన్ అనే ముచ్చట పార్టీ వర్గాల్లో షికార్లు చేస్తోంది. నిజానికి ఇప్పటికే ఆయన అభిమానులు బొకేలు, పూల దండలు సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం ..
Publish Date: Dec 3, 2021 5:48PM

ఏపీకి వార్నింగ్‌.. ఓటీఎస్‌తో టోక‌రా.. ఒట్టేసిన జ‌గ‌న‌న్న‌.. టాప్‌న్యూస్ @ 7pm

1. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మార్చడం కుదరదని ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్రం తేల్చిచెప్పింది. కేంద్ర పథకాలను జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పేర్లు పెట్టడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2021 - 22 ఆర్థిక సంవత్సరంలో ఐసీడీఎస్, ఐసీపీఎస్ పథకాలకు కేంద్రం కేటాయించిన రూ.187 కోట్లకు లెక్క చూపాలని కేంద్రం ఆదేశించింది. ఎంపీ రఘురామ ఫిర్యాదుపై ఈ మేర‌కు కేంద్రం స్పందించింది. 2. ఏపీ ప్రజలు నవరత్నాలను నమ్మి.. నవగ్రహాలు చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు చంద్ర‌బాబు. ఎప్పుడో ఎన్టీఆర్ కట్టించిన ఇంటికి.. ఇప్పుడు జగన్ పట్టా ఇస్తాను అంటున్నాడు. డ్వాక్రా మహిళపై వేధింపులు మొదలు పెట్టారు. రాక్షస జాతిలా జ‌గ‌న్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలను పీల్చుకుతింటోందని టీడీపీ అధినేత చంద్ర‌బాబు మండిప‌డ్డారు.  3. ఓటీఎస్ పేరుతో డ్వాక్రా మహిళలకు జగనన్న టోకరా వేస్తున్నాడని టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ ఎద్దేవా చేశారు. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో డ్వాక్రా మహిళల ఖాతాలు ఖాళీ అవుతున్నాయన్నారు. జగన్‌రెడ్డి కబంధహస్తాల్లో అభయహస్తం చిక్కిందని లోకేష్‌ ఆరోపించారు. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ఎవరూ కట్టొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇళ్ల పట్టాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తుందని లోకేష్‌ ప్రకటించారు.  4. సీఎం జగన్‌ను టీటీడీ కాంట్రాక్ట్ కార్మికురాలు రాధా కలిశారు. టీటీడీ కార్మికుల సమస్యలపై జగన్ సానుకూలంగా స్పందించారు. తలమీద చేయిపెట్టి ఒట్టేయాలని సీఎంను రాధా కోరారు. 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తానని రాధా తల మీద చేయిపెట్టి జగన్‌ ఒట్టేశారు.  5. ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ చేపట్టారు. సీబీఐ కోర్టు కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు జగన్ కోరారు. తన బదులు న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలని జగన్ కోరారు. హాజరు మినహాయింపు ఇచ్చేందుకు గతేడాది సీబీఐ కోర్టు నిరాకరించింది.  సీబీఐ వాదనల కోసం విచారణ ఈనెల 6కి హైకోర్టు వాయిదా వేసింది. 6. డిగ్రీ కాలేజీల్లో యాజమాన్య కోటా భర్తీపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. యాజమాన్య కోటాలో 30 శాతం సీట్ల భర్తీకి కన్వీనర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న.. ప్రభుత్వ నిబంధనను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీని కన్వీనర్‌ చూస్తారనే నిబంధనను కూడా న్యాయస్థానం కొట్టివేసింది. యాజమాన్య కోటాలో సీటు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీలకు జగనన్న విద్యాదీవెన వర్తింపజేయాలని కోర్టు ఆదేశించింది.  7. వడ్లను రోడ్ల మీద, కల్లాల్లో పెట్టుకుని రైతులు నిరీక్షణ చేస్తున్నారని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ఎప్పుడుకొంటారో తెలియక కుప్పల మీదే రైతుల గుండెలు ఆగిపోతున్నాయన్నారు. యాసంగి వడ్ల మీద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకెంత మంది రైతులు చస్తే తమ కండ్లు చల్లబడుతాయి కేసీఆర్ అని ప్రశ్నించారు.  8. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కరోనా కలకలం రేపింది. ఒక్కరోజే ఏడుగురు విదేశీ ప్రయాణికులకు కరోనా పాజిటివ్ అని తేలింది. శాంపిల్స్‌ను జినోమ్ సీక్వేన్స్‌కు అధికారులు పంపించారు. ఇప్పటివరకు 12 మంది విదేశీ ప్రయాణికులకు కరోనా నిర్దారణ అయింది. పాజిటివ్ వచ్చిన ప్రయాణికులను టిమ్స్ ఆస్పత్రికి తరలించారు.  9. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కరోనా సోకిన ప్రయాణికురాలు పరార్ అయింది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెను ఆస్పత్రికి తరలించేలోపు ఎయిర్‌పోర్ట్‌ నుంచి పరారైంది. పాస్‌పోర్ట్‌ ఆధారంగా చిరునామా గుర్తించి జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమె ఇంటికి వెళ్లగా ఇంటి నుంచి కూడా ఆమె త‌ప్పించుకుంది. చివరకు ఎలాగోలా ఆమెను అదుపులోకి తీసుకుని టిమ్స్‌ ఆస్పత్రికి అధికారులు తరలించారు.  10. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతుఫానుగా మారింది. విశాఖకు ఆగ్నేయంగా 420 కి.మీ. దూరంలో , ఒడిషా గోపాల్‌పూర్‌కు 530 కి.మీ. దూరంలో 'జవాద్' తుపాను కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా తుపాను కదులుతోంది. శ‌నివారం ఉదయానికి ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత పెరగనుంది.  
Publish Date: Dec 3, 2021 5:44PM

10 రోజుల్లో పీఆర్సీ.. తెలీద‌న్న‌ జేఏసీ.. మ‌రి, మిగ‌తా డిమాండ్లు?

పీఆర్సీ ఒక్కటే ఉద్యోగుల డిమాండ్ కాదు.. ఇతర డిమాండ్లు కూడా ఉన్నాయి.. సీపీఎస్ రద్దు, జీపీఎఫ్ నిధులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ లాంటి అనేక సమస్యలు ఉన్నాయి.. అంటూ 10 రోజుల్లో పీఆర్సీ అంటూ తిరుపతిలో సీఎం జగన్ చేసిన ప్రకటనపై ఉద్యోగ సంఘాలు స్పందించాయి. పీఆర్సీకి సంబంధించి సీఎం చేసిన ప్రకటనపై ఉద్యోగ సంఘాల‌కు సమాచారం లేదన్నారు ఏపీ జేఏసీ అమ‌రావ‌తి అధ్య‌క్షుడు బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు. తిరుపతిలో తమ సంఘాలకు చెందిన ఉద్యోగులెవరూ సీఎంను కలవలేదని స్పష్టం చేశారు.  పీఆర్సీ సంబంధిత అంశాలపై కార్యదర్శుల కమిటీతో చర్చలకు మాత్రమే ప్రభుత్వం పిలిచిందని బొప్ప‌రాజు వెల్లడించారు. పీఆర్సీ నివేదిక బహిర్గతం చేస్తేనే దానిపై చర్చించేందుకు వీలు కలుగుతుందని స్పష్టం చేశారు. ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలిపితేనే ఉద్యమాన్ని విరమించుకుంటామని.. లేదంటే ఉద్యమ కార్యాచరణ యథాతథంగా కొనసాగుతుందని బొప్పరాజు తేల్చి చెప్పారు.   ఉద్యోగుల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో పీఆర్సీ విషయంలో శుక్ర‌వారం ఉద‌యం సీఎం జగన్‌ కీలక ప్రకటన చేశారు. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పారు. తిరుపతి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో ఉండగా.. కొందరు ఉద్యోగులు పీఆర్సీ గురించి ప్లకార్డులను ప్రదర్శించారు. వాటిని గమనించిన సీఎం ఉద్యోగులను పిలిచి మాట్లాడారు. పీఆర్సీతో పాటు, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు ముఖ్య‌మంత్రిని కోరారు. స్పందించిన జగన్‌.. పీఆర్సీ ప్రక్రియ పూర్తయ్యిందని చెప్పారు. పది రోజుల్లో ప్రకటన ఉంటుందని తెలిపారు. అయితే, అధికారికంగా త‌మ‌కు ఎలాంటి స‌మాచారం లేద‌ని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. పీఆర్సీ ఇచ్చినంత మాత్రాన స‌మ‌స్య‌లు తీరిపోవ‌ని.. మిగ‌తా డిమాండ్ల‌నూ నెర‌వేర్చాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నాయి. 
Publish Date: Dec 3, 2021 4:54PM

ఒమిక్రాన్.. ఏం చేయాలి? ఏం చేయ‌కూడ‌దు? ఫుల్ డిటైల్స్‌..

1. ఒమిక్రాన్‌. ఇది కొత్త కరోనా వేరియంట్‌. డెల్టా ర‌కం కంటే ఆరు రెట్లు ఎక్కువ వేగంగా విస్తరిస్తుంది.  2. ఒమిక్రాన్‌ను దక్షిణాఫ్రికా దేశంలో ముందుగా గుర్తించారు. ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్, బ్రిటన్, ఇజ్రాయెల్, హాంగ్ కాంగ్, బోట్స్వానా, బెల్జియం దేశాల్లో వేగంగా విస్త‌రిస్తోంది.  3. ఒమిక్రాన్ బాధితుల‌ లక్షణాలు:- అలసటగా ఉండడం, కండరాల నొప్పి, గొంతులో గరగర, పొడి దగ్గు. జ్వరం. క‌రోనా వేరియంట్లు అన్నిటికీ ఒకే త‌ర‌హా ల‌క్ష‌ణాలు ఉంటాయి. 4. ఒమిక్రాన్ ఎవ‌రికైనా సోక‌వ‌చ్చు. ఇమ్మ్యూనిటీ బాగా వీక్‌గా ఉంటే మిన‌హా.. దీని ప్రభావం స్వల్పం అంటున్నారు. అసలు వచ్చినట్టే తెలియదని చెబుతున్నారు.  5. ఒమిక్రాన్‌కు భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేదు. జాగ్ర‌త్త‌లు మాత్రం త‌ప్ప‌నిస‌రి. నిర్ల‌క్ష్యం మ‌హా ప్ర‌మాదం.  6. రెండు డోసుల వ్యాక్సినేష‌న్ పూర్తి కాని వారు.. ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా సోక‌ని వారు.. ఒమిక్రాన్ బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండాలి. వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సినేష‌న్ పూర్తి చేసుకోవాలి.  7. ప్రస్తుత వ్యాక్సిన్‌ల వల్ల పొందే యాంటీబాడీలు ఒమిక్రాన్‌ ను తటస్థీకరించేందుకు సరిపోయేలా కనిపించడం లేదు. అయినప్పటికీ తీవ్ర వ్యాధి బారినపడే అవకాశాలు మాత్రం తక్కువే. భారత్‌లో 40ఏళ్ల వయసు పైబడిన వారికి బూస్టర్‌ డోసును ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని జీనోమ్‌ శాస్త్రవేత్తలు సిఫార్సు చేశారు. ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ సీక్వెన్సింగ్‌ కన్సార్టియం (INSACOG) విడుదల చేసిన వారాంతపు నివేదికలో ఈ విషయం తెలిపింది. 8. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఇప్పటికే గుర్తించిన దేశాల నుంచి కొనసాగే రాకపోకలపైనా పర్యవేక్షణ ముమ్మరం చేయాలని ఇన్సాకోగ్‌ సూచించింది. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ను సమర్థవంతంగా చేపట్టడంతో పాటు నిర్ధారణ పరీక్షలను భారీగా పెంచాలని స్పష్టం చేసింది. 9. అంతర్జాతీయ ప్రయాణికులను నిరంతరం పర్యవేక్షించడానికి సమాయత్తం కావాలి. ప్రధానంగా ముప్పు అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు చేయించి, పాజిటివ్‌గా తేలిన అన్ని నమూనాలను జన్యు పరిణామక్రమ విశ్లేషణ కోసం ఇన్సాకాగ్‌ ఆధ్వర్యంలోని ల్యాబ్‌లకు తప్పనిసరిగా పంపాలి.  10. వైరస్‌ సోకిన వారికి తక్షణం వైద్యసేవలు అందించాలి. నాణ్యమైన వైద్యం అందించడంలో ఏమాత్రం రాజీ పడకూడదు. పాజిటివిటీ రేటు 5% లోపునకు పరిమితం చేసే లక్ష్యంతో పనిచేయాలి. రోగులను ఆదిలోనే గుర్తించి, వారిని ఐసోలేష‌న్‌లో ఉంచి వైరస్‌ వ్యాప్తిని నిరోధించాలి. కొవిడ్‌పై అసత్య ప్రచారాలు ప్రజల్లో ఆందోళనకు దారితీస్తాయి.
Publish Date: Dec 3, 2021 4:22PM

ఓ హీరోకి ₹3 కోట్లు మ‌స్కా.. కిలేడీ శిల్పా...

శిల్పా చౌద‌రి. వారం రోజులుగా న్యూస్‌లో ట్రెండ్ అవుతున్న కి..లేడీ. చిన్నాచిత‌కా చీటింగ్ కేసులు కావు ఆమెవి. కొడితే కోట్లు వ‌చ్చిప‌డాల‌నేదే ఆమె టార్గెట్‌. అందుకే శిల్పా చౌద‌రి మోసాలన్నీ కోట్ల‌లోనే. తాజాగా, ఆమె చేతిలో మోస‌పోయిన వారిలో ఓ సినీ హీరో కూడా చేరారు. ఆ హీరో నుంచి ఏకంగా 4 కోట్లు కొట్టేసింది. ఆ మేర‌కు పోలీసుల‌కు మ‌రో ఫిర్యాదు అందింది.  సినీ హీరో హర్ష.. శిల్పా చౌద‌రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెహరి చిత్రంలో హీరోగా నటించిన హర్ష.. శిల్పా చౌదరి తన ద‌గ్గ‌ర‌ ₹3 కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వ‌లేదంటూ పోలీసుల‌కు కంప్లైంట్ చేశారు. ఇక్క‌డ మ‌రో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. హ‌ర్ష హీరోగా చేసిన‌ సెహ‌రి సినిమాకు నిర్మాత శిల్పా చౌద‌రీనే.  హ‌ర్ష ఫిర్యాదుతో ఇప్పటివరకు శిల్పా చౌద‌రి చేసిన‌ మోసాల విలువ‌ ₹10 కోట్లుగా తేలింది. అంతకు ముందు.. శిల్పాచౌదరిపై నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేయగా.. వారి నుంచి ₹7.05 కోట్లు తీసుకుందని పోలీసులు తేల్చారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్లలోనూ ఆమెపై కేసులు నమోదయ్యాయి.  కిట్టీ పార్టీల పేరుతో మహిళలను ఆకట్టుకున్న శిల్ప.. స్థిరాస్తి వ్యాపారం కోసం డబ్బు తీసుకొందని పోలీసులు గుర్తించారు. భారీగా లాభాలు ఇస్తామని నమ్మించి మోసం చేసిందని ఆమెపై ఫిర్యాదులు అందాయి. వీకెండ్‌ పార్టీల పేరుతో తొలుత కొంతమందితో మొదలైన కిట్టీ పార్టీలను తర్వాత జూదంగా మార్చేశారు. దివానోస్‌ పేరుతో క్యాసినో స్టార్ట్ చేశారు. సంపన్న కుటుంబాలకు చెందిన 90 మంది మ‌హిళ‌ల‌ను సభ్యులుగా చేర్పించుకున్నారు. వారాంతాల్లో విందులు, వినోదాల పేరుతో జ‌ల్సాలు చేయిస్తూ.. అప్పుల పేరుతో డ‌బ్బులు లాగేసేవారు. హీరో మహేశ్‌బాబు సోదరి ప్రియదర్శిని నుంచి 2 కోట్లు వ‌సూలు చేశారు. తాజాగా, హీరో హ‌ర్ష త‌నను 3 కోట్ల‌కు మోసం చేసిందంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. శిల్పా చౌద‌రి బాధితుల సంఖ్య పెరుగుతుండ‌టంతో.. తదుపరి విచారణకు 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. అయితే, రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది కోర్టు. ఆమె ఎవరెవరి వద్ద నుంచి ఎంత సొమ్ము తీసుకుందనే వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే, ఆ డబ్బును ఎక్కడికి మళ్లించారు? బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలపైనా లోతుగా ఆరా తీస్తున్నారు.  విచార‌ణ‌లో భాగంగా శిల్పాచౌద‌రికి చెందిన రెండు అకౌంట్లను పోలీసులు ఫ్రీజ్‌ చేశారు. అయితే వాటిలో అంతగా డబ్బు లేదని తెలిసింది. దీంతో మ‌రి కొల్ల‌గొట్టిన కోట్ల‌న్నీ ఆమె ఎక్కడికి తరలించారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. హ‌వాలా మార్గంలో విదేశాల‌కు పంపించార‌ని అంటున్నారు. మ‌రోవైపు, శిల్పాచౌదరి భర్త శ్రీకృష్ణ శ్రీనివాస్‌ ప్రసాద్‌ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడన్న సమాచారంతో ఆయ‌న‌ ఎక్కడెక్కడ భూములు కొన్నారన్న వివరాలను సేకరిస్తున్నారు.  
Publish Date: Dec 3, 2021 3:06PM

రాక్షస జాతిలా ప్ర‌జ‌ల‌ను పీల్చుకుతింటోన్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం..

రాక్షస జాతిలా జ‌గ‌న్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలను పీల్చుకుతింటోందని టీడీపీ అధినేత చంద్ర‌బాబు మండిప‌డ్డారు. అధికారంలోకి వచ్చిన తరువాత కమిషన్ వేయడం ఖాయం.. ఇప్పుడు తప్పు చేసిన వారిపై అప్పుడు చర్యలు తప్పవని హెచ్చ‌రించారు. ఏపీ ప్రజలు నవరత్నాలను నమ్మి.. నవగ్రహాలు చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు చంద్ర‌బాబు. ఎప్పుడో ఎన్టీఆర్ కట్టించిన ఇంటికి.. ఇప్పుడు జగన్ పట్టా ఇస్తాను అంటున్నాడు. డ్వాక్రా మహిళపై వేధింపులు మొదలు పెట్టారు. రాజ్యాంగం ఇంకా బతికే ఉంది.. తప్పును ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది.. అన్నారు చంద్ర‌బాబు.   టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ‘ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం’ కార్యక్రమంలో చంద్ర‌బాబు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి దివ్యాంగులు తరలివచ్చారు. దివ్యాంగుడైన కోటేశ్వరరావు ఎన్టీఆర్‌కు, తనకు పైలట్‌గా ఉండేవారని చెప్పుకొచ్చారు. ప్రతి టూర్‌లో కోటేశ్వరరావు ముందు వెళ్లేవారన్నారు. దివ్యాంగుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టి లక్షల మందికి సాయం చేసిన విషయాన్ని చంద్ర‌బాబు గుర్తు చేశారు. ‘విభిన్న ప్రతిభావంతులకు రూ.500 ఉండే పెన్షన్..3 వేలు చేశాం. చట్ట సభలకు దివ్యాంలను పంపే బాధ్యత నేను తీసుకుంటా!. దివ్యాగులకు రిజర్వేషన్‌లు ఇచ్చే ప్రయత్నం చేస్తాను’ అని చంద్రబాబు చెప్పారు. 
Publish Date: Dec 3, 2021 2:39PM