Top Stories

కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి "వైట్ ఛాలెంజ్‌".. ముదిరిన డ్ర‌గ్స్ జ‌గ‌డం..

మాట‌కు మాట‌. స‌వాల్‌కు ప్ర‌తిస‌వాల్‌. కేటీఆర్‌-రేవంత్‌రెడ్డి మ‌ధ్య డ్ర‌గ్స్ జ‌గ‌డం ముదురుతోంది. ప‌ర‌స్ప‌ర స‌వాళ్లతో పొలిటిక‌ల్ హీట్ పెరుగుతోంది. మంత్రి కేటీఆర్‌కు డ్ర‌గ్స్‌కు లింకు పెడుతూ కొద్దిరోజులుగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. గ‌జ్వేల్ స‌భ‌లో మ‌రింత సంచ‌ల‌న కామెంట్లు చేశారు. డ్ర‌గ్స్ వాడేవారికి కేటీఆర్ అంబాసిడ‌ర్ అంటూ ర‌చ్చ రాజేశారు. రేవంత్ వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కేటీఆర్‌. డ్ర‌గ్స్‌తో త‌న‌కేంటి సంబంధం అంటూ రేవంత్‌రెడ్డిని నిల‌దీశారు.  డ్ర‌గ్స్ వివాదంలో మ‌రో అడుగు ముందుకేసిన కేటీఆర్‌.. త‌న ర‌క్త న‌మూనాలు, లివ‌ర్ టెస్ట్‌కు శాంపిల్స్ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌న్నారు. ద‌మ్ముంటే రాహుల్‌గాంధీ కూడా డ్ర‌గ్స్ ప‌రీక్ష‌ల‌కు రావాల‌ని స‌వాల్ చేశారు. త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తే ఊరుకోమ‌ని.. అవ‌స‌ర‌మైతే రాజ‌ద్రోహం కేసులు పెడ‌తామ‌ని రేవంత్‌రెడ్డిని హెచ్చ‌రించారు కేటీఆర్‌. నోటికొచ్చిన‌ట్టు వాగితే.. బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్‌.  పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం ఏమాత్రం త‌గ్గ‌ట్లే. మంత్రి కేటీఆర్ స‌వాల్‌కు ప్ర‌తిగా.. "వైట్ స‌వాల్" విసిరారు రేవంత్‌. కేటీఆర్‌, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డిల‌కు తాను "వైట్ ఛాలెంజ్‌" విసురుతున్న‌ట్టు చెప్పారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు గ‌న్‌పార్కు ద‌గ్గ‌ర‌కు వ‌స్తా. మీరు ఏ హాస్పిట‌ల్‌కు ర‌మ్మంటే అక్క‌డికి వ‌స్తా. త‌న ర‌క్తం, వెంట్రుక‌లు ఇస్తా. మీకిష్ట‌మొచ్చిన ప‌రీక్ష‌లు చేయించుకోండి. అంటూ కేటీఆర్‌, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డిల‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి "వైట్ ఛాలెంజ్" విసిరడం సంచ‌ల‌నంగా మారింది.  టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో రాణా, ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌ల‌ను కేటీఆర్ కాపాడాల‌ని చూసింది నిజం కాదా? బెంగ‌ళూరులో డ్ర‌గ్స్ కేసుపై విచార‌ణ జ‌రుగుతుంటే టీఆర్ఎస్ నేత‌లు ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు? హైద‌రాబాద్ స్కూల్స్, కాలేజెస్‌, ప‌బ్స్‌లో డ్ర‌గ్స్ అమ్ముతుండ‌టం  మీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యం కాదా?  యువ‌త‌రాన్ని కాపాడే బాధ్య‌త లేదా? డ్ర‌గ్స్ కేసుపై మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించ‌రు? అంటూ రేవంత్‌రెడ్డి నిల‌దీశారు. మ‌రి, రేవంత్ విసిరిన "వైట్ ఛాలెంజ్"ని కేటీఆర్, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డిలు స్వీక‌రిస్తారా?  
Publish Date:Sep 18, 2021

పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్‌సింగ్ రాజీనామా.. సిద్ధూతో మ్యాచ్‌లో కెప్టెన్ ఔట్‌..

పంజాబ్ సీఎం ప‌ద‌వికి కెప్టెన్ అమ‌రీంద‌ర్‌సింగ్ రాజీనామ చేశారు. హైక‌మాండ్ ఆదేశాల‌తో గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి రాజీనామా ప‌త్రం స‌మ‌ర్పించారు. త‌న‌కు తెలీకుండా సీఎల్పీ స‌మావేశం ఏర్పాటు చేస్తూ.. ఇప్ప‌టికి మూడుసార్లు త‌న‌ను అధిష్టానం ఇలానే అవ‌మానించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు అమ‌రీంద‌ర్‌. ఎవ‌రిని ముఖ్య‌మంత్రి చేయాలో అధిష్టానం ఇష్ట‌మ‌ని.. త్వ‌ర‌లోనే త‌న భ‌విష్య‌త్తు కార్య‌చ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు. వ‌చ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో సీఎం ప‌ద‌వికి అమ‌రీంద‌ర్ సింగ్ రాజీనామా చేయ‌డం ఆస‌క్తిక‌రం.  కొంత‌కాలంగా పంజాబ్ కాంగ్రెస్‌లో అమ‌రీంద‌ర్‌కు, పీసీసీ చీఫ్‌ సిద్ధూకు మ‌ధ్య కోల్డ్ వార్ తారాస్థాయిలో జ‌రుగుతోంది. ఇటీవ‌ల పార్టీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీని క‌లిసిన ఉప‌యోగం లేకుండా పోయింది. గత అర్థరాత్రి, పంజాబ్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి హరీశ్‌ రావత్‌ చేసిన ట్వీట్‌తో తాజా పరిణామాలు తెరమీదకు వచ్చాయి. రావత్ త‌న ట్వీట్‌లో శాసనసభాపక్ష అత్యవసర  సమావేశం నిర్వహించనున్నట్లు. తెలిపారు. అలాగే, ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి హాజరు కావాలని ఎమ్మెల్యేలను కోరారు. ఆ వెంటనే పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధూ సైతం ప్రతి ఒక్కరూ సమావేశానికి రావాలని ఆదేశించారు. దీంతో అర్థరాత్రి నుంచే ఉహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి ఉద్వాసకే, అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాల్లో సిద్ధూ వర్గం విక్టరీ సింబల్స్’తో చెలరేగిపోయింది. అయితే, ఈ పరిణామాలు అన్నీ పైకి హఠాత్తుగా జరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ, చాలా కాలంగా పార్టీలో అంతర్గతంగా లుకలుకలు  బహిర్గతంగా భగ్గు మంటూనే ఉన్నాయి.  ముఖ్యమంత్రికి ఉద్వాసన అంటూ గత కొంత కాలంగా సాగుతున్న ప్రచారం తనకు అవమానకరంగా ఉందని ఆయన నేరుగా సోనియాకే చెప్పినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ తరుణంలో పార్టీ సీఎల్పీ సమావేశానికి పిలుపునివ్వడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇక తాను సీఎం పదవిలో కొనసాగలేనని అమ‌రీంద‌ర్‌సింగ్‌ రాజీనామా  చేసిన‌ట్టు తెలుస్తోంది.   
Publish Date:Sep 18, 2021

వైసీపీ దాడుల‌పై ఎదురుదాడి.. ర‌గులుతున్న ర‌చ్చ‌..

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికార నివాసంపై శుక్రవారం అధికార వైసీపీ నాయకులు, కార్యకర్తలు జరిపిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. విజయవాడలో పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. నల్లజెండాలతో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. దాడికి నాయకత్వం వహించిన జోగి రమేష్ డౌన్ డౌన్ అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. జోగి రమేష్, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చిత్రపటాలను ద‌హనం చేశారు. సుధీర్గ రాజకీయ అనుభవం ఉన్న, చంద్రబాబుపై దాడిని ఖండిస్తూ మహిళల కూడా ఆందోళనలకు దిగారు. మంత్రి పదవి కోసం ఎంతకైనా దిగజారుతారా? అంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై రాళ్లదాడికి పాల్పడిన వైసీపీ నేతలు.. శనివారం మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడును టార్గెట్ చేశారు. నర్సీపట్నంలో వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు అయ్యన్న పాత్రుడి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.  మరోవంక చంద్రబాబు నివాసం వద్ద నిన్న చోటుచేసుకున్న ఘటనలపై గుంటూరు పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. తెదేపా నేత జంగాల సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేయగా.. ఎమ్మెల్యే జోగి రమేశ్‌ డ్రైవర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై మరో కేసును నమోదు చేసినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు. ఇదలా ఉండగా, చంద్రబాబు నివాసంపై అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేయడాన్ని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, రామకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ చిత మోహన్ తీవ్రంగా  ఖండించారు. రాజకీయాల్లో ఇలాంటి ధోరణి సరైంది కాదని రామకృష అన్నారు. ప్రతిపక్ష నేత ఇంటిపై దాడికి పూనుకోవడం ముమ్మాటికీ తప్పని.. సీఎం దీనిని ఖండించాలని, వైసీపీ శ్రేణుల్ని అడుపుచేయాలని అన్నారు. మాజీ సీఎం ఇంటిపై దాడి చేస్తుంటే పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అలాగే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారన్నారు. ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, విమర్శలు సైద్ధాంతికం ఉండాలని హితవుపలికారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా హోం మంత్రి ఏమి చేయలేని పరిస్థితిలో ఉండడం శోచనీయమన్నారు. సిపిఐ నేత రామకృష్ణ విచారం వ్యక్త పరిచారు.  అలాగే, చంద్రబాబు ఇంటిపై అధికార పార్టీ దాడిని ఖండిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి,  చింతా మోహన్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలను గౌరవించినప్పుడే అధికార పార్టీ గౌరవం నిలబడుతుందన్నారు.  
Publish Date:Sep 18, 2021

బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తాం.. రాజ‌ద్రోహం కేసు పెడ‌తాం.. రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్‌

డ్ర‌గ్స్ కేసు టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఆ డ్ర‌గ్స్ బుర‌ద‌లోకి కేటీఆర్‌నూ లాగారు రేవంత్‌రెడ్డి. నేరుగా ఇలా అని అన‌కుండా.. ప‌రోక్షంగా.. కేటీఆర్‌.. గోవా.. డ్ర‌గ్స్.. ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌.. ఇలా పొడిపొడిగా మాట్లాడి.. మేట‌ర్‌ అర్థ‌మ‌య్యేలా మెసేజ్ ఇచ్చారు. అటు బీజేపీ అధ్య‌క్షులు బండి సంజ‌య్ సైతం కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు గ్లామ‌ర్ కోసం డ్ర‌గ్స్ వాడుతున్నారంటూ ప‌రోక్షంగా కేటీఆర్‌నే టార్గెట్ చేశార‌ని అంటారు. ఇలా, కేటీఆర్‌కు డ్ర‌గ్స్ మ‌కిలి బాగానే అంటించేస్తున్నాయి ప్ర‌తిప‌క్షాలు.  ఇక గ‌జ్వేల్ స‌భ‌లోనైతే పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మ‌రింత సూటిగా ఆరోప‌ణ‌లు చేశారు. తండ్రి తాగుబోతుల‌కు, కొడుకు డ్ర‌గ్స్ వాడేవారికి అంబాసిడ‌ర్లుగా మారారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో, కేటీఆర్ డ్ర‌గ్స్ వాడ‌తారా? కేటీఆర్‌కు డ్ర‌గ్స్ దందాకు లింకుందా? కేటీఆర్ గోవా అందుకే వెళ్లారా? ఇలా ర‌క‌ర‌కాల ఊహాగానాలు.. అంత‌కుమించి అనుమానాలు. విష‌యం ముద‌ర‌డంతో కేటీఆర్ ఆ ఆరోప‌ణ‌ల‌పై స్పందించాల్సి వ‌చ్చింది. తాజాగా మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడుతూ.. త‌న‌కూ డ్రగ్స్‌కు ఏం సంబంధం?.. ఏ పరీక్షకైనా తాను సిద్ధమంటూ స‌వాల్ చేశారు. బ్ల‌డ్ టెస్ట్‌, లివ‌ర్ టెస్ట్ ఏదైనా చేయించుకోవ‌డానికి సిద్ధ‌మ‌ని.. ద‌మ్ముంటే రాహుల్‌గాంధీ కూడా డ్ర‌గ్స్ ప‌రీక్ష‌ల‌కు రావాల‌ని స‌వాల్ చేశారు. త‌న‌పై ఇలా త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తే ఊరుకోమ‌ని.. అవ‌స‌ర‌మైతే రాజ‌ద్రోహం కేసులు పెడ‌తామ‌ని రేవంత్‌రెడ్డిని హెచ్చ‌రించారు కేటీఆర్‌. ఎవ‌డో గాడిద త‌న‌పై ఈడీకి ఫిర్యాదు చేశాడ‌ట అంటూ రేవంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నోటికొచ్చిన‌ట్టు వాగితే.. బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్‌.  రేవంత్‌రెడ్డిపై మ‌రిన్ని విమ‌ర్శ‌లు చేశారు కేటీఆర్‌. 50 కోట్లతో పీసీసీ కొనుక్కున్నారని ఆ పార్టీ నేత అన్నారు. పీసీసీ కొనుక్కున్న నేత రేపు ఎమ్మెల్యే టిక్కెట్టు అమ్ముకోరా? పెయింటింగ్‌ వేసుకునే వ్యక్తికి జూబ్లీహిల్స్‌లో నాలుగు ఇళ్లు ఎలా వచ్చాయి? ఒకప్పుడు సున్నమేసిన వ్యక్తి.. ఇవాళ కన్నమేస్తున్నారు. అంటూ రేవంత్‌రెడ్డిపై ఘాటైన విమ‌ర్శ‌లు చేశారు మంత్రి కేటీఆర్‌.   
Publish Date:Sep 18, 2021

నిన్న చంద్ర‌బాబు హౌజ్‌.. ఇవాళ‌ అయ్యన్న ఇల్లు.. వైసీపీ మూక‌దాడులు..

ఉండ‌వ‌ల్లి ర‌చ్చ నర్సీప‌ట్నంకు షిఫ్ట్ అయింది. శుక్ర‌వారం చంద్ర‌బాబు ఇంటిపై దాడితో ర‌చ్చ చేసిన వైసీపీ మూక‌లు.. శ‌నివారం టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఇంటిపై అటాక్‌కు ప్ర‌య‌త్నించారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు భారీ ర్యాలీగా వ‌చ్చారు. అయ్యన్న పాత్రుడి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జ‌రిగింది. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర‌ ఉద్రిక్తత నెలకొంది.  అయితే, వైసీపీ దాడిని ముందే ఊహించిన అయ్య‌న్న వ‌ర్గం.. పెద్ద సంఖ్య‌లో ఆయ‌న ఇంటి ముందు మోహ‌రించింది. అయ్య‌న్నపాత్రుడు ఇంటి ముట్ట‌డికి వైసీపీ ఎమ్మెల్యే, ఆయ‌న అనుచ‌రులు వ‌స్తున్నార‌ని తెలుసుకున్న టీడీపీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు భారీగా ఆయ‌న‌కు ర‌క్ష‌ణ‌గా త‌ర‌లివ‌చ్చారు. ఇరువైపులా పెద్ద సంఖ్య‌లో జ‌నం పోగ‌వ‌డంతో అయ్య‌న్న‌పాత్రుడి ఇంటిద‌గ్గ‌ర హైటెన్ష‌న్ నెల‌కొంది.  దీంతో పోలీసులు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వైసీపీ శ్రేణుల‌ను క‌ట్ట‌డి చేశారు. అక్క‌డి నుంచి బ‌ల‌వంతంగా త‌ర‌లించారు. దీంతో ఉద్రిక్త‌త స‌ద్దుమ‌నిగింది. వైసీపీ నేత‌లు ఇలా దౌర్జన్యాలకు పాల్పడడడం మంచిది కాద‌ని టీడీపీ నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక.. వ్యక్తులు, కులాల మధ్య చిచ్చురేపుతున్నారని మండిపడ్డారు. గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలకంటే.. ప్రస్తుతం అయ్యన్న ఎక్కువగా మాట్లాడలేదని గుర్తు చేశారు. కొవిడ్ నిబంధనల పేరుతో టీడీపీ నేతలను పరామర్శలకు కూడా అంగీకరించని పోలీసులు.. వైసీపీ నేతలకు మాత్రం గొడవలకు అనుమతిస్తున్నారని ఆరోపించారు. దౌర్జన్యాలకు పాల్పడిన వారందరిపై కేసులు నమోదు చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.  
Publish Date:Sep 18, 2021

టీఆర్ఎస్‌కు కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం.. అమిత్‌షా చెప్పిందీ అదేనా..?

నిర్మల్‌లో బీజేపీ బహిరంగ సభ సక్సెస్. అదే రోజున గజ్వేల్‌లో కాంగ్రెస్ సభ గ్రాండ్ సక్సెస్. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం మీద రోజు రోజుకు పెరుగుతున్న వ్యతిరేకతకు సంకేతమా? అంటే, కావచ్చును. అయితే ప్రతిపక్షాల  బహిరంగ సభలు సక్సెస్ కావడం ఒక్కటే ప్రభుత్వ వ్యతిరేకతకు కొలమానమా, అంటే..కాదు కానీ, జాగ్రత్తగా గమనిస్తే, గజ్వేల్’లో కాంగ్రెస్ కానీ, నిర్మల్’లో బీజేపీ కానీ, జన సమీకరణకు పెద్దగా ఒళ్ళు హూనం చేసుకోలేదు. గత నెలలో హుజూరాబాద్’లో దళిత బంధు ప్రారంభ సభకు, జనాలను సమీకరించేందుకు అధికార పార్టీ ఎంత హడావిడి చేసిందో చూశాం, కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఇలా హేమాహేమీలు అందరూ జనసమీకరణ క్రతువును మినిట్ టూ మినిట్ మానిటర్ చేశారు. ఎమ్మెల్యేలకు టార్గెట్స్ ఫిక్స్ చేసి, ఏసీ బస్సులు పెట్టి, ఇంకా ఏవేవో చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరకు ప్రభుత్వ యంత్రాంగం అంతా నడుం బిగిస్తే కానీ, సర్కార్ ఇజ్జద్  నిలవలేదు. దళిత బంధు సభ జన సమీకరణ ప్రయత్నాలతో  పోల్చిచూస్తే, గజ్వేల్, నిర్మల్ సభల సక్సెస్ కోసం కాంగ్రెస్, బీజేపీలు అంతగా కష్టపడవలసిన అవసరం రాలేదు. నిజమే, రెండు పార్టీలు జనసకరణకు కొంత ప్రయత్నం అయితే చేశాయి. కానీ,  చాలా వరకు జనం స్వచ్చందంగానే సభలకు హాజరయ్యారు. సక్సెస్ చేశారు.  అదలా ఉంటే, అక్కడ నిర్మల్’లో బీజేపీ నాయకులు.. ఇక్కడ గజ్వేల్’లో కాంగ్రెస్ నాయకులు  సహజంగానే ఉమ్మడి శత్రువు, తెరాసను, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం, ఫ్యామిలీనే టార్గెట్ చేశారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి అదే భాషలో మాట్లాడారు. అదే సమయంలో, కాంగ్రెస్, బీజేపీల నాయకులు పరస్పర ఆరోపణలకు ఏ మాత్రం వెనకాడ  లేదు. ముఖ్యంగా చరిత్ర నుంచి.. నడుస్తున్న చరిత్ర వరకు మతపరంగా ఎవరు ఎవరి పక్షమో చాటుకునే ప్రయత్నం రెండు వైపులా నుంచి చేశారు. గజ్వేల్ సభకు ముఖ్య అతిధిగా వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్య సభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే దేశంలో దళితులు, గిరిజనులు, బహుజనులకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. అలాగే, ముస్లిం రిజర్వేషన్లను కాంగ్రెస్ సమర్దిస్తుందని చెప్పారు.  మరోవంక నిర్మల సభకు ముఖ్య అతిధిగా వచ్చిన కేంద్ర హోం మంత్రి మతపరమైన రిజర్వేషన్లకు తమ పార్టీ, ప్రభుత్వం వ్యతిరేకమని కుండబద్దలు కొట్టారు. రాష్ట్రంలో అమలవుతున్న మైనారిటీ రిజర్వేషన్ రద్దు చేయాలని డిమాండ్ సైతం చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే లౌకిక వాద పార్టీలు అనుసరిస్తున్న ముస్లిం సంతృష్టీకరణ విధానాలను ఎండ కట్టారు. తెరాస ప్రభుత్వం ఎంఐఎంకు భయపడుతోందని, తమ పార్టీ ఎవరికీ భయ పడదని అన్నారు. అలాగే, తెలంగాణ కారు తెరాస‌దే,  కేసీఆర్’దే అయినా స్టీరింగ్ మాత్రం ఎంఐఎం చేతిలో ఉందని చురకలు అంటించారు. ఒవైసీలకు భయపడే కేసీఆర్ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించ‌డం లేద‌న్నారు. తాము అధికారంలోకి వ‌స్తే అధికారికంగా విమోచ‌న దినం నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు.  ఇతర విషయాలు ఎలా ఉన్నప్పటికీ మతం విషయంలో కాంగ్రెస్, బీజేపీలు చెరో గట్టున ఉన్నాయి అనేది సెప్టెంబర్ 17 న మరో మారు స్పష్టమైంది. అంతే కాదు, ముందు ముందు రెండు పార్టీలు అదే కార్డు ప్లే చేసేందుకు సిద్దమవుతున్నాయి అనే విషయంలో కూడా స్పష్టమైంది. నిజానికి జాతీయ స్థాయిలో కూడా అదే ధోరణి కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం కశ్మీర్’లో పర్యటించిన రాహుల గాంధీ, తానూ కశ్మీరీ హిందువునని ప్రకటించుకున్నారు. అలాగే, ఈ మధ్య కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీనే నిజమైన హిందూ పార్టీ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.   అదలా, ఉంటే తెలంగాణలో బీజేపీ కంటే కాంగ్రెస్ బలంగా ఉందని, అమిత్ షా పరోక్షంగానే అయినా అంగీకరించారు. అయితే దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించి పోతోంది కాబట్టి రాష్ట్రంలోనూ తెరాసకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదని అమిత్  షా సూత్రీకరించారు. అదెలా  ఉన్నా, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ‘దే పై చేయని అమిత్ షా అంగీకరించడం సెప్టెంబర్ 17 రాజకీయానికి కొసమెరుపు.  
Publish Date:Sep 18, 2021